ఆక్సిజన్‌ను సులువుగా అందించే కొత్త పరికరం.. ప్రభుత్వ వైద్యుడి సృష్టి

12-09-2017: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్‌ను సులువుగా అందించే కొత్త పరికరాన్ని పుదుకోట జిల్లాలోని ఆలంగుడి ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్‌ డాక్టర్‌ ఎం.పెరియస్వామి కనిపెట్టారు. శ్వాస పీల్చుకోలేని రోగులకు గొంతు ద్వారా ఆక్సిజన్‌ను అందించేందుకు ఆయన చేసిన కృషికి ఫలితంగా కొత్త శ్వాస పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ... అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు, శస్త్ర చికిత్స సమయంలో రోగులు సులువుగా శ్వాస పీల్చుకోలేరని, ఈ సమస్యను అడ్డుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతిని మార్చి ఆక్సిజన్‌ను సులువుగా అందించేందుకు తాను కనిపెట్టిన శ్వాస పరికరం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. శ్వాస పీల్చుకోలేక సతమతమైన సుమారు 300 మందికి ప్రయోగాత్మకంగా ఈ పరికరంతో అందించిన చికిత్సకు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రక్తనాళాలలో చేరిన మలినాలను బయటకు పంపించడం, రక్తపోటు కలగకుండా ఈ పరికరం అదుపు చేస్తుందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఈ పరికరంతో నర్సులు కూడా రోగులకు చికిత్సలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.