మ్యాగీలో సీసం.. నిజమే

సుప్రీంలో అంగీకరించిన ‘నెస్లే ఇండియా’
‘నెస్లే’పై ప్రభుత్వ కేసు విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ, జనవరి 3: లక్షల మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతక సీసం ఉందని స్పష్టమైంది. మ్యాగీ తయారీ సంస్థ ‘నెస్లే ఇండియా’ స్వయంగా సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని అంగీకరించింది. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) పరిశోధనలోనూ సీసం ఉందని తేలింది. దీంతో నూడుల్స్‌ ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరం మరోసారి చర్చనీయాంశమైంది. మ్యాగీలో ప్రాణాంతక సీసం ఉందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ‘నెస్లే ఇండియా’ సంస్థకు రూ.640 కోట్ల జరిమానా విధించాలంటూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ 2015లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ) ఎదుట కేసు వేసింది.
 
దీనిపై అదే ఏడాది డిసెంబరులో స్టే విధించిన సుప్రీంకోర్టు మ్యాగీ నూడుల్స్‌ను పరిశోధించాలని సీఎఫ్‌టీఆర్‌ఐను ఆదేశించింది. నూడుల్స్‌లో ప్రాణాంతక సీసం ఉందన్న సీఎఫ్‌టీర్‌ఐ తాజా నివేదికతో ఆ మ్యాగీని ఎందుకు తినాలని నెస్లే తరఫు న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. దీంతో సీసం అనుమతించిన పరిమితిలోనే ఉందని సమాధానమిచ్చిన సింఘ్వీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్‌(ఎంఎస్‌జీ) లేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్‌ డీవీ చంద్రచూడ్‌, హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్ర ప్రభుత్వం వేసిన కేసును విచారణకు అనుమతించింది.