ఇంటి వద్దకే వైద్య సేవలు

ఆఖరి మజిలీలో ఆసరా

మంచానికే పరిమితమైన రోగుల కోసం

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏ రోగీ.. ఆస్పత్రిలోనే చనిపోవాలని కోరుకోరు. ముఖ్యంగా కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు. ఎలాగూ చనిపోతామని తెలుసు గనుక.. తమ ఆఖరి మజిలీని ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దే పూర్తిచేయాలని భావిస్తుంటారు. అయితే ఇంటి వద్ద మంచానికే పరిమితం కావడంతో మానసికంగా కుంగుబాటుకు లోనై.. తీవ్ర నైరాశ్యంతో చావు కోసం ఎదురుచూస్తుంటారు. ఇలా కేన్సర్‌, పక్షవాతం తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ.. ఇంట్లో మంచానికే పరిమితమైన వారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వారికి ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ ‘పాలియేటివ్‌ కేర్‌’ సేవలను ప్రారంభించింది. 

ప్రస్తుతం ఆదిలాబాద్‌, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్‌ అర్బన్‌, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇంటి వద్దకే వైద్య సేవలందించేందుకు జిల్లాకొకటి చొప్పున అంబులెన్స్‌ సర్వీసులను కేటాయించారు. ప్రధానంగా కేన్సర్‌ చివరి దశలో ఉన్న రోగులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను ప్రారంభించారు. గ్రామాల్లోని ఇలాంటి రోగుల వివరాలను స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సేకరించి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పంపుతా రు. వెంటనే పాలియేటివ్‌ కేర్‌ అం బులెన్స్‌ రంగంలోకి దిగుతుంది. వైద్య సిబ్బంది నేరుగా రోగి ఇంటి వద్దకే వెళ్లి వారికి సపర్యలు చేస్తుంది. వారిలో మనోధైర్యం నింపడంతో పాటు, ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉందన్న భరోసా కల్పిస్తారు. వీలైనంత మేర కు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా రోగిలో విశ్వాసా న్ని నింపుతారు. మానసిక కుంగుబాటు నుంచి బ యటకు వచ్చేలా చేస్తారు. అంబులెన్స్‌ సేవలను అన్ని జిల్లాలకూ విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.