రెండేళ్ల బాలుడికి లుకేమియా

వైద్యానికి రూ. 8లక్షలకు పైగా ఖర్చు
డబ్బుల్లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు

లింగాలఘణపురం జూలై 10: ఆ కుటుంబానికి రెక్కాడితే గానీ డొక్కాడదు. అలాంటి ఇంట్లో రెండేళ్ల బాలుడికి లుకేమియా వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు దిక్కు తోచక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నాగరాజు-భాగ్యవతి దంపతుల కుమారుడైన అభిరామ్‌(2) కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్నాడు. దీనికి వరుసగా మూడేళ్లపాటు కీమోథెరఫీ చేయించాలని, దీనికోసం రూ. 8లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్న నాగరాజుకు అభిరామ్‌ను బతికించుకోవడం కష్టసాధ్యంగా మారింది. నాగరాజు తన స్నేహితుల సహాయంతో అభిరామ్‌ను లిటిల్‌ స్టార్స్‌ చిల్డ్రన్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. సాయం చేయదల్చిన దాతలు బర్కత్‌పుర బ్రాంచ్‌ ఎస్‌బీఐ (ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఎస్‌బీఐ0007641) ఖాతా నెంబర్‌ 20121768103లో జమ చేయాలని కోరుతున్నాడు.