గుండెను కాపాడుకోవాలంటే ఈ మూడింటికి స్వస్తి చెప్పండి!

హర్రీ వర్రీ, కర్రీస్‌కు స్వస్తి చెప్పండి!
డా. చొక్కలింగం పిలుపు

చెన్నై, 28-09-2019: గుండెను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ హర్రీ, వర్రీ, కర్రీస్‌కు స్వస్తి పలకాలని సుప్రసిద్ధ హృద్రోగశస్త్ర చికిత్సా నిపుణులు డాక్టర్‌ చొక్కలింగం పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ హృదయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశమిస్తూ ప్రస్తుత యాంత్రిక యుగంలో మానవులు పనిభారం వల్ల తొందరపడుతుండటం (హర్రీ) ఆ తొందరలో అనుకున్న పనులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడంతో గుండె అధికంగా కొట్టుకుంటుందన్నారు. ఇక కష్ట్రాలు (వర్రీ) వచ్చినప్పుడు క్రుంగిపోవడం ఆ కష్టాలపై భయాందోళన చెందటం వల్ల కూడా గుండె మితిమీరి కొట్టుకుంటుందన్నారు. 

ఇటీవలి కాలంలో ఇంటి భోజనాలకు స్వస్తి చెప్పి హోటల్‌ భోజనాలకు అలవాటుపడుతున్న జనాలు కొవ్వు అధికంగా ఉన్న వంట పదార్థాల (కర్రీస్‌) ను అధికంగా ఆరగించటం వల్ల కూడా గుండె జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. గుండెను కాపాడుకోవాలంటే ఒత్తిళ్లకు గురికాకుండా, కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను ఆరగించాలని, అదే సమయంలో ముందు జాగ్రత్తగా తరచూ వైద్య పరీక్షలు కూడా చేసుకోవాలన్నారు.