ఎల్‌వోసీ బంద్‌!.. కేసీఆర్‌ సర్కారు కీలక నిర్ణయం

కార్పొరేట్‌ చికిత్సలకు నో
రోగులిక సర్కారు దవాఖానలకే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలున్నా ప్రైవేటుకు వెళుతున్నారనే భావన
సర్కారు నిధులు కార్పొరేట్‌ పాలవుతున్నాయని అభిప్రాయం
ప్రజా ప్రతినిధుల ఆందోళన

అత్యవసర సమయాల్లో వైద్య చికిత్సలకు జారీ చేసే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ)ను ఆపివేయాలని కేసీఆర్‌ సర్కారు నిర్ణయించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ఇచ్చే ఎల్‌వోసీలను ఇప్పటికే గణనీయంగా తగ్గించగా.. ఇకనుంచి పూర్తిస్థాయిలో నిలిపివేయనుంది. కేవలం నిమ్స్‌ వంటి కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఎల్‌వోసీలను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 
హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ)ల పేరిట ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు ఇస్తున్న సాయాన్ని ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్‌వోసీలు, సీఎంఆర్‌ఎఫ్‌ కింద ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఉదారంగా ఎల్‌వోసీలు జారీ చేసింది కూడా. కానీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉన్నా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పెద్దఎత్తున రోగులు చికిత్స చేయించుకుంటున్నారని, ఇందుకు ప్రజాధనాన్ని పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు అత్యాశకు పోతున్నాయని, లక్ష రూపాయల ఖర్చయ్యే శస్త్ర చికిత్సకు మూడు నాలుగు లక్షల రూపాయల అంచనాలు పంపిస్తున్నాయని గమనించింది. వాటి అవకతవకలకు సంబంధించి వచ్చిన పలు ఆరోపణలను సర్కారు పరిశీలించింది.
 
ఈ నేపథ్యంలోనే ఎల్‌వోసీలను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ, బీమాకు మించి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు రోగులు ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తారు. రోగికి చేయాల్సిన శస్త్ర చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే అంచనా వేసి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇచ్చిన ఎస్టిమేట్‌ను, లేఖను ప్రభుత్వానికి సమర్పిస్తారు. దానితోపాటు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫారసు లేఖ తప్పనిసరి. ఆ వినతులను ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పరిశీలిస్తుంది. ఆస్పత్రి వేసిన అంచనా వ్యయంలో 60-70 శాతం వరకు ప్రభుత్వం భరిస్తుందని, ఆ రోగికి చికిత్స అందించాలని లేఖ ఇస్తుంది. దీన్నే ఎల్‌వోసీ అంటారు. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రం నుంచే అమల్లో ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొనసాగిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు గతంలో రోజూ 25-30 ఎల్‌వోసీల చొప్పున.. నెలకు 750-800 వరకు జారీ చేసేవారు. తొలుత ఉదారంగా ఇచ్చిన ఎల్‌వోసీలకు ఆ తర్వాత పరిమితులు విధించారు.
 
సిఫారసు చేసిన ప్రజా ప్రతినిధి స్వయంగా వచ్చి.. లేదా ఫోన్‌ చేస్తే కానీ మంజూరు చేసేవారు కాదు. ఆ తర్వాత ఎల్‌వోసీలకు ఇచ్చే మొత్తాన్ని సగానికి తగ్గించేశారు. గత కొద్ది రోజులుగా పూర్తిగా బంద్‌ చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఇకనుంచి ఎల్‌వోసీలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించడం వెనక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎల్‌వోసీలు కావాలంటూ ఇప్పటి వరకు వచ్చిన అభ్యర్థనలన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన రోగుల నుంచే! వాస్తవానికి, వారు చేయించుకున్న చికిత్సల్లో చాలామటుకు సర్కారీ దవాఖానల్లో ఉచితంగా అందే సౌకర్యం ఉన్నా.. ప్రైవేటుకు వెళ్లి ఎల్‌వోసీలు కోరడంతో ప్రజా ధనం కార్పొరేట్‌ ఆస్పత్రుల పాలవుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
 
అందుకే, ఎల్‌వోసీల బంద్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎంతో అత్యవసరమై.. సదరు రోగికి సిఫారసు చేసే ప్రజా ప్రతినిధి స్వయంగా క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఎల్‌వోసీ కావాలని కోరితే తప్ప మంజూరు చేయడం లేదు. గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు నెలకు వందల్లో ఎల్‌వోసీలు వెళ్లగా.. ఇప్పుడు వాటి సంఖ్య కనీసం పదుల్లో కూడా లేదని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
 
కాస్తో కూస్తో వచ్చే పేరుకు గండి
సర్కారు దవాఖానల్లో ఉచితంగానే వైద్యం అందిస్తారని, వాటికే ఎల్‌వోసీలు మంజూరు చేయడంలో ఆంతర్యమేంటో తమకు అర్థం కావడం లేదని కొందరు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కాస్తో కూస్తో ఇటువంటి సేవల వల్ల మంచి పేరు వస్తోందని, కొందరు దగ్గరి కార్యకర్తలకు కూడా ఇటువంటి అత్యవసర, ప్రాణం మీదికొచ్చేవి ఇప్పించుకోలేకపోతే మేం ఎందుకన్న అభిప్రాయం వారిలో కలుగుతుందని వాపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఎల్‌వోసీలు మంజూరు చేయకపోతే కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.