‘కంటి వెలుగు’లో కిట్ల మసక!

రూ.75 కిట్‌ రూ.150కి కొనుగోలు
ఆరోగ్య శాఖ కమిషనర్‌ వద్దన్నా.. ధర పెంచిన ఎంఐడీసీ
ఎవరడుగుతారులే అని ధీమా
కాంట్రాక్టు కంపెనీకి ‘వెలుగు’ పంచిన పథకం

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న ప్రారంభం కానున్న ‘కంటి వెలుగు’ పథకం కాంట్రాక్టు కంపెనీలకు జేబులు నింపే పథకంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులు రూపాయి వస్తువును పది రూపాయిలకు కొనుగోలు చేస్తున్నారు. 5 విడతల్లో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని తొలుత పాఠశాల స్థాయిలో పూర్తిచేసి, తర్వాత ఇంటింటికీ వెళ్లి స్ర్కీనింగ్‌ చేయనున్నారు. దీనికిగాను రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క బృందంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, పీహెచ్‌సీ సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికీ వెళ్లి కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తిస్తారు. ఈ క్రమంలో అక్కడికక్కడే కొన్ని పరీక్షలు చేస్తారు. దీనికిగాను పరీక్ష పరికరాలతో కూడిన కిట్‌లను కొనుగోలు చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఈ కిట్‌లో ఒక టార్చ్‌లైట్‌, టేపు, చార్ట్‌ ఉంటాయి. వీటి ద్వారా ప్రాథమికంగా కంటి ఆరోగ్యాన్ని తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఒకేసారి 50 వేల కిట్‌లను కొనుగోలు చేసేందుకు సిద్ధం అయింది.

 
కిట్‌లను సరఫరా చేసేందుకు కంపెనీని ఎంపిక చేసే బాధ్యతను ఏపీ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు (ఏపీఎ్‌సఎంఐడీసీ) అప్పగించింది. మూడు వస్తువులతో కూడిన కిట్‌ను గరిష్ఠంగా రూ.100లోపు కొనుగోలు చేయాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశించారు. దీంతో ఈ సూచనల మేరకే ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులు గత నెలలో టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయి. అయితే, ఈ కంపెనీలు ఆరోగ్యశాఖ సూచించిన రూ.100 కంటే రెండు నుంచి మూడు రెట్ల ధరను కోట్‌ చేశాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కంపెనీ కిట్‌ను రూ.170 చొప్పున పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన కంపెనీలన్నీ రూ.200 పైన కోట్‌ చేశాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యశాఖ సూచించిన ధరలకే కిట్‌లను సరఫరా చేసే కంపెనీలను అధికారులు ఆహ్వానించాలి. అప్పటికీ కంపెనీలు ముందుకు రాకపోతే కొత్త టెండర్లకు వెళ్లాలి. కానీ, ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులు రూ.170 కోట్‌ చేసిన కంపెనీకే టెండర్‌ కట్టబెట్టారు. కంపెనీతో మాట్లాడి ఫైనల్‌గా రూ.150కి సరఫరా చేసేలా ఒప్పించి ఆర్డర్‌ ఇచ్చేశారు.
 
రూ.75కి మించదు: డాక్టర్లు
ఆరోగ్యశాఖ కొనుగోలు చేయదలచిన కిట్‌ విలువ రూ.60 నుంచి రూ.75 మాత్రమే ఉంటుందని ఆప్తమాలజీ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యశాఖ సూచించిన టార్చ్‌లైట్‌ ఒకటి రూ.80 నుంచి రూ.100 ఉంటుందని, ఒకేసారి 50 వేల టార్చ్‌లైట్‌లు కొనుగోలు చేస్తారు కాబట్టి ఒక్కొక్కటీ రూ.30 నుంచి రూ.40కి మించదని తెలిపారు. టేపు రూ.5, చార్ట్‌ రూ.3 మాత్రమే ఉంటాని అంటున్నారు. ఈ వస్తువులను పెట్టడానికి ఉపయోగించే బ్యాగ్‌ రూ.10 నుంచి 15 మాత్రమే ఉంటుంది. ఈ కిట్‌లను జిల్లాలకు సరఫరా చేసేందుకు ట్రాన్స్‌పోర్టుతో కలిపి కిట్‌ విలువ రూ.75 కంటే ఎక్కువ పడే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఒక్కొక్క కిట్‌ను రూ.150 కొనుగోలు చేస్తున్నారు. రూ.37 లక్షలకు కొనుగోలు చేయాల్సిన కిట్‌లకు అత్యధికంగా రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. కాగా, ఈ కొనుగోళ్ల వెనుక కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు సమాచారం.