ఏపీలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు

జీజీహెచ్‌, 06-07-2019 (కాకినాడ): తమ స్టైఫండ్‌లను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూనియర్‌ డాక్టర్లు శుక్రవారం సమ్మె బాట పట్టారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సమస్యలు పరిష్కరించాలని జూనియర్‌ డాక్టర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జీవన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వాసు ప్రవీణ్‌ మాట్లాడుతూ హౌస్‌ సర్జన్‌లు, పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, సీనియర్‌ రెసిడెంట్‌(ఎ్‌సఆర్‌)లు సుమారు 400మంది రంగరాయ వైద్యకళాశాలకు అనుబంధంగా కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వారికి రావాల్సిన ఉపకార వేతనాలు(స్లైఫండ్‌)లు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 4.50 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.
 
   అయితే బకాయిల కోసం ప్రభుత్వానికి ఎన్ని పర్యాయాలు విన్నవించినా స్పందించక పోవడంతో సమ్మె అనివార్యమైందన్నారు. జూనియర్‌ డాక్టర్లలో చాలా మంది మధ్య తరగతి వారేనని, కొంత మందికి వివాహాలై పిల్లలు ఉన్నారని స్లైఫండ్స్‌ మీద ఆధారపడే వారే ఎక్కువ శాతం ఉన్నారని తెలిపారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌. మహాలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం. రాఘవేంద్రరావులతో చర్చలు జరిగినప్పటికీ ఆరు నెలల బకాయి స్లైఫండ్‌లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 7 నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, జూడాల సమ్మెకు సీపీఐ, ఏఐటీయూసీ, బీకేఎంయూ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు మద్దతు తెలిపారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో జీజీహెచ్‌లోని అన్ని ఓపీలు వెలవెలబోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, క్షతగాత్రులు, గర్భిణులు, వృద్ధులు జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో అవస్థ పడ్డారు.