కోడి.. బరువు కోసం ఇంజక్షన్లు?

40 రోజుల్లో రెడీ

60 రోజుల గడువు తగ్గిస్తూ కొత్త విధానంలో పిల్లలు
కొత్త వ్యాధులు వస్తాయనే ఆందోళన

గుడివాడ:మాంసాహార ప్రియులకు శుభవార్త. ముఖ్యంగా చికెన్‌ ఇష్టపడేవారికి ఇక మాంసానికి లోటే ఉండదు. ఇంతవరకు ఓ బ్రాయిలర్‌ కోడి పెరిగి.. పెద్దదై.. కోతకు సిద్ధం కావడానికి 60 రోజులు పట్టగా.. ఇప్పుడు 40 రోజుల్లోనే కోతకు రానున్నది. 38 నుంచి 40 రోజుల్లోనే బ్రాయిలర్‌ కోడి రెండు కిలోల బరువుతో మార్కెట్‌కు రానున్నది. గతంలో 60 రోజులకు సగటున రెండు కిలోల బరువు పెరిగిన కోడి.. క్రమేపీ కాలపరిమితి తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో 60 నుంచి 55 రోజులు, 55 నుంచి 45 రోజులకు తగ్గగా.. ప్రస్తుతం 38 నుంచి 40 రోజులకు వచ్చింది. గ్యాడ్‌ పేరెంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే గుడ్డు ద్వారా స్వల్పకాలిక బ్రాయిలర్‌ గ్రిడ్‌ను పెంపకందారులు ఉపయోగించడమే ఇందుకు కారణం. రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌అండ్‌డీ) ఆమోదంతోనే గ్యాడ్‌ పేరెంట్‌ నుంచి గుడ్డుగా.. ఫ్యాక్టరీలో పిల్లగా తయారై.. పెంపకందారులకు చేరుతోంది. బ్రాయిలర్‌ కోడి కోతకు వచ్చే కాలపరిమితిని శాస్త్రీయ ప్రక్రియగానే నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు కోడి బరువు పెరిగేందుకు మార్కెట్‌కు పంపే రోజున దాని రెక్కలకు సిరంజర్‌ ద్వారా వాటర్‌ ఎక్కించే ప్రక్రియ కొన్నిచోట్ల జరుగుతోంది. దీనివల్ల కోడిబలంగా, ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు, సగటున 100 గ్రాముల బరువు పెరుగుతుంది. అయితే 60 రోజులకు కోతకు వచ్చే బ్రాయిలర్‌తో పోలిస్తే 40 రోజులకే కోతకు వస్తున్న మాంసం రుచిగా ఉండడం లేదని వినియోగదారులు అంటున్నారు. కాలపరిమితి తగ్గించేందుకు ప్రమాదకరమైన ఇంజక్షన్లు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవిధంగా సిద్ధమైన కోడి మాంసం తింటే.. రుచి మాట ఎలా ఉన్నా.. కొత్త వ్యాధులు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.