ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సమయం పెంపు

ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సమయాన్ని 2 గంటలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న ఓపీ వేళలను మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్తు పరిధిలోని 110 ఆస్పత్రులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. డయాగ్నస్టిక్స్‌ సమయాన్ని కూడా రెండు గంటలు పొడిగించారు. రోగులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు చేయాలని ఆదేశించారు.