స్టెంట్ల ధరను తేల్చేదెలా

పనితీరు బట్టే ధర అన్న తయారీదారులు 

అన్ని స్టెంట్లూ ఒకటే అంటున్న సబ్‌ కమిటీ 
ప్రస్తుతం 5 రెట్ల దాకా అధికంగా వసూలు 
నియంత్రణ తప్పనిసరన్న ఎథికల్‌ డాక్టర్లు 
నెలాఖరుకు స్టెంట్ల ధరలపై తుది నిర్ణయం 
హైదరాబాద్‌ సిటీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ధమనులు మూసుకుపోయినప్పుడు ఉపయోగించే ‘కరోనరీ స్టెంట్ల’ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర మందుల జాబితా (నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌- ఎన్‌ఎల్‌ఈఎం)లో చేర్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వచనం ప్రకారం, అత్యవసర మందుల జాబితాలో చేరిస్తే, మెజారిటీ ప్రజల ఆరోగ్య అవసరాలను ఆయా మందులు తీర్చాలి. అంతేనా, ప్రజలకు ఏమాత్రం భారం కాని ధరలో అన్ని వేళలా, ఎన్ని మందులు కావాలంటే అన్ని మందులు అందుబాటులో ఉండాలి. కానీ, రోగులకు అవసరమైనన్ని స్టెంట్లూ అందుబాటులో ఉండడం లేదు. వాటి ధరలూ సామాన్య రోగులు భరించేలా లేవు. అందుకే, స్టెంట్ల ధరలను నియంత్రించాలనే డిమాండ్లు చాలా పెద్దఎత్తునే ఉన్నాయి. వాటికి ఒక పరిమితి ఉండాలని ఉద్యమం కూడా సాగుతోంది. అలయెన్స్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ ఫర్‌ ఎథికల్‌ హెల్త్‌ కేర్‌ ఈ దిశగా విశేష కృషి చేస్తోంది. మందుల ధరలను నిర్ణయించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ)కి వారం రోజుల కిందట కొన్ని డాక్యుమెంట్లు సమర్పించింది. స్టెంట్ల ధరలను సరళీకరించాలంటూ ఎన్‌పీపీఏ ఎదుట ప్రదర్శన ఇచ్చింది. వ్యాపారులు, ఆస్పత్రులు కలిసి స్టెంట్ల ధరలను భారీగా అంటే, కొన్ని సందర్భాల్లో ఐదు రెట్ల వరకూ పెంచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. అబాట్‌ కంపెనీకి చెందిన ఎవరోలైమస్‌ ఎల్యూటింగ్‌ కరోనరీ స్టెంట్‌ ధర రూ.50 వేలు మాత్రమేనని, కానీ, దాని ఎమ్మార్పీ ధరను మాత్రం రూ.1.15 లక్షలుగా ముద్రించారని తప్పుబట్టింది. అబాట్‌ కంపెనీకే చెందిన స్టేబుల్‌ స్టెంట్‌ ధర రూ.82 వేలని, కానీ, దాని ఎమ్మార్పీ 1.4 లక్షలని తెలిపింది. బోస్టన్‌ సైంటిఫిక్‌ కంపెనీకి చెందిన స్టెంట్ల ధరలు రూ.32 వేల నుంచి రూ.70 వేల వరకూ ఉన్నాయని, కానీ, ఎమ్మార్పీ పేరిట లక్షన్నర నుంచి రూ.1.65 లక్షలు వసూలు చేస్తున్నానరి స్పష్టం చేసింది. ‘‘ఎన్‌పీపీఏ ఎదుట మేం మా ప్రదర్శన ఇచ్చాం. అడ్డగోలు ధరలపై దానికి పూర్తి అవగాహన ఉంది. ఈ నెలఖరుకు స్టెంట్ల ధరలను సరళీకరిస్తామని, ఆ మేరకు ప్రకటన కూడా చేస్తామని మాకు హామీ ఇచ్చారు’’ అని అలయన్స్‌ సభ్యుడు జీఎస్‌ గ్రేవల్‌ తెలిపారు. ధరలపై పరిమితి విధించిన తర్వాత విక్రయదారులకు 20 శాతానికి మించి మార్జిన్‌ ఉండదని, ఆ విధంగా పరిమితి ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. స్టెంట్లు ప్రాణావసర మందుల జాబితాలోకి వస్తాయని, కనుక, వాటిపై దిగుమతి సుంకంతోపాటు ఇతర పన్నులనూ ఎత్తివేయాలని కోరారు. 
 
స్టెంట్ల లాబీ చేయనిస్తుందా!?
కరోనరీ స్టెంట్ల ధరలకు పరిమితి విధించాలని ఐదు నెలల కిందట కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు సూచించింది. అయితే, కేంద్రం నిర్ణయించిన ఐదు నెలల తర్వాత, స్టెంట్లను ధరల నియంత్రణ జాబితాలో ఉంచాలని ఫార్మాస్యూటికల్స్‌ విభాగం నిర్దేశించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అనుమతి రావడంతో ఇప్పుడు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ స్టెంట్ల ధరలను నిర్ణయించడానికి సిద్ధమైంది. ఎన్‌ఎల్‌ఈఎంలోని షెడ్యూల్‌ 1లో వీటిని జోడించనుంది. ‘‘నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ, స్టెంట్‌ మ్యానుఫాక్చరింగ్‌ లాబీ వీటిని ధరల నియంత్రణ జాబితాలోకి రాకుండా ఇన్నాళ్లూ అడ్డుకుంది. దేశంలో స్టెంట్లను తయారు చేసే 80 శాతం కంపెనీల్లో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాలే ఉంటాయి. వాళ్లే ధరలను పెంచేస్తారు. అమ్మకాలను నియంత్రిస్తారు. డాక్టర్లకు లంచాలు ఎరవేస్తారు. ఎమ్మార్పీ నిబంధన లేకపోవడంతో ఆస్పత్రులు వాస్తవ ధరకన్నా 3 నుంచి 7 రెట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు’’ అని ఎథికల్‌ హెల్త్‌కేర్‌ డాక్టర్లు వివరిస్తున్నారు. ఇటీవల ఐఎంఎస్‌ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, స్టెంట్ల ధరలు గత మూడేళ్లలో బాగా తగ్గాయి. మొత్తం ఆపరేషన్‌ ఖర్చు తగ్గడం లేదంటే వేరేకారణముందని చెబుతోంది. 
 
అన్ని స్టెంట్లూ ఒకటేనా!?
స్టెంట్ల ధరలపై నియంత్రణ విధించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే.. వాటిలో వివిధ రకాలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయం జరగాలనే వాదనను తెరపైకి తెచ్చారు. అన్ని రకాల స్టెంట్‌లనూ ఒకే గూటికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఇందుకు తయారీదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్టెంట్ల తయారీ కంపెనీలు తమ ధరలను సమర్థించుకుంటున్నాయి. ‘‘ఇప్పుడు విభిన్నమైన స్టెంట్స్‌ వస్తున్నాయి. బయో డీగ్రేడబుల్‌ స్టెంట్లతోపాటు డ్రగ్‌ ఇల్యూటింగ్‌ స్టెంట్లను కూడా ఒకే గాటన కట్టడం వీలుకాదు. కొన్ని స్టెంట్లు నాణ్యత లేనివి. అందుకే, స్టెంట్లను వర్గీకరించాలి. లేకపోతే, సీలింగ్‌ ధర పెంచాలి’’ అని కోరుతున్నాయి. అయితే, ధరల నిర్ణయంపై ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ ఈ వాదనను తోసిపుచ్చుతోంది. ప్రఖ్యాత ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 17 మంది ప్రముఖ కార్డియాలజి్‌స్టలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ స్టెంట్లను వర్గీకరించాలన్న వాదనను కొట్టిపారేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రగ్‌ ఇల్యూటింగ్‌ స్టెంట్లకు ఉప వర్గీకరణ చేయడం సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. ‘‘ఈ వాదనలో వాస్తవం లేకపోలేదు. ఇటీవల ఓ సంస్థ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. మూడు బ్రాండ్లు కోట్‌ చేసింది. అయితే, స్టెంట్ల పనితీరు, నాణ్యత విషయంలో ఆ మూడింటికి పెద్ద తేడా ఏమీ చూపలేదు. కానీ, ధరల్లో మాత్రం భారీ తేడా చూపింది. అయినా, కార్డియాలజి్‌స్టల దగ్గర ఆ సంస్థ ప్రతినిధులు మాత్రం ఒకదాన్ని మించిన ప్రొడక్ట్‌ మరొకటి అని ఊదరగొడుతున్నారు’’ అని పేరు రాయడానికి ఇష్టపడని డాక్టర్‌ ఒకరు చెప్పారు. అత్యవసర మందుల జాబితాలో స్టెంట్లను చేరిస్తే ధరలు దిగివస్తాయని సామాన్యులు ఆశ పడుతున్నారు. కానీ, నాణ్యతపరంగా జరిగే నష్టాలను పట్టించుకోవడం లేదని కార్డియాలజి్‌స్టలు తప్పుబడుతున్నారు. ‘‘మనం ఓ ధరను నిర్ణయించి అంతకే అమ్మాలి అంటే దాని ధరతోపాటు నాణ్యతపై కూడా ప్రభావం పడుతుంది. స్టెంట్ల తయారీలో ఎంతో పరిశోధన జరుగుతోంది. వాటి ధర 23 వేల దగ్గరే ఉండాలనుకుంటే ఇంకా మనం తొలి తరం స్టెంట్ల వద్దనే ఉండిపోయేవాళ్లం. అలాగని నియంత్రణ వద్దని అనను. ఓ కమిటీని నియమించి, స్టెంట్లను వర్గీకరించి ధరలను నిర్ణయిస్తే బాగుంటుంది’’ అని స్టార్‌ ఆస్పత్రిలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజి్‌స్టగా చేస్తోన్న డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి వివరించారు. అయితే, మన దేశంలో ప్రధానంగా మూడు విదేశీ కంపెనీల స్టెంట్లను వాడుతున్నారని, వాటిని ఆయా కంపెనీల దేశీయ కార్యాలయాలు దిగుమతి చేసుకుని డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాయని, అవే కంపెనీలు దిగుమతి చేసుకుంటుండడంతో ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ ధరలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఎన్‌పీపీఏ సూచించినట్టు దిగుమతి ధరపై 35 శాతం మార్జిన్‌ అంటే ఇప్పటికే ఉన్న అధిక ధరలకు రాజముద్ర వేసినట్లే అని ఎథికల్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, స్టెంట్ల ధరలపై నియంత్రణ నాణ్యమైన వైద్య సేవలకు అవరోధంగా మారుతుందని అబాట్‌, మెడ్‌ట్రానిక్‌ వంటి సంస్థలకు లాబీయింగ్‌ చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ చెబుతుంటే.. ఈ నిర్ణయంతో దేశీయంగా మెడికల్‌ డివైజ్‌ మేకర్స్‌కు అవకాశాలు లభిస్తాయని ఆ పరిశ్రమ తరపున లాబీయింగ్‌ జరుపుతున్న వారు అంటున్నారు. ఈ లాబీయింగ్‌ సంస్థల కారణంగానే ఎన్నాళ్లగానో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్న ఎన్‌పీపీఏ.. ఇప్పుడు ధరల నిర్ణయానికి సిద్ధపడుతుండటం సంతోషించతగ్గ పరిణామమని ఎథికల్‌ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
స్టెంట్లు బయట ఎందుకు దొరకవంటే! 
సాధారణంగా ఏ ఆస్పత్రిలో అయినా స్టెంట్లు ఆస్పత్రిలోనే ఉంటాయి. బయట దొరకవు. ఇవి 2.25 - 4 మిల్లీ మీటర్‌ డయా మీటరు, 8 - 48 మిల్లీ మీటర్ల వరకూ పొడవు ఉంటాయి. డ్రగ్‌ కోటెడ్‌, నాన్‌ డ్రగ్‌ కోటెడ్‌, బయో డీగ్రేడబుల్‌ అంటూ వివిధ కాంబినేషన్లలో దాదాపు 60-70 సైజ్‌లు ఉంటాయి. ‘‘రోగికి ఆపరేషన్‌ మొదలుపెట్టిన తర్వాత ఏ సైజ్‌ కావాలన్నది డాక్టర్‌ నిర్ణయిస్తాడు. ముందుగానే నిర్ణయించవచ్చు కదా అని అంటే నిర్ణయించవచ్చు. కానీ, ఒక్కోసారి రోగి పరిస్థితి ముందుగా నిర్ణయించిన సైజ్‌కు అంగీకరించక పోవచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాదు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా అన్ని రకాల సైజ్‌లనూ దగ్గర పెట్టుకునే డాక్టర్‌ ఆపరేషన్‌ ప్రారంభిస్తాడు. బయట కొనుక్కుని రమ్మని చెప్పరు. బయట కూడా అమ్మరు’’ అని డాక్టర్లు వివరిస్తున్నారు. 
 
నియంత్రించాలి..కానీ, వర్గీకరించాలి
ఇప్పుడు స్టెంట్లు రూ.20 వేల నుంచీ ఉన్నాయి. వాటిలోనూ క్వాలిటీ పెరిగింది. 97 శాతం సక్సెస్‌ అవుతున్నాయి. ఆరోగ్య శ్రీలో కూడా స్టెంట్లు ఉన్నాయి. వాటి ధరల నియంత్రణ మంచిదే. మందుపూత ఉన్న, మందు పూత లేని స్టెంట్లను ఒకే గాటన కట్టలేం. వాటిని రెగ్యులేట్‌ చేయాల్సిందే. కానీ, వాటిని వర్గీకరించాలి. కోట్ల రూపాయలు పరిశోధనకు కావాల్సి ఉంటుంది. ఇన్నోవేషన్‌ రావాలంటే వర్గీకరణ తప్పనిసరి. అదే సమయంలో అడ్డగోలు ధరలను మాత్రం తగ్గించాలి. 
- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ, సీనియర్‌ 
కన్సల్టెంట్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్‌