బోదకాలు బాధితులకు ఆసరా..

జిల్లాల్లో 2,812 మంది బాధితులకు లబ్ధి

ప్రతి ఏటా రూ.3.37 కోట్ల పంపిణీ
ప్రభుత్వ పరంగా ఉచిత మందులు, చికిత్స
బోదకాల బాధితుల్లో రాష్ట్రంలో జిల్లాకు 6వ స్థానం

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు

11-02-2018: బోదకాలు బాధితులకు ప్రభుత్వం ఆసరా పింఛన్‌ అందించేందుకు నిర్ణయించింది. జిల్లాలో 2,812 మంది బాధితులు ఉన్నారు. వీరు ఆసరా పథకం ద్వారా ప్రతినెలా రూ.28.12 లక్షల పింఛన్‌ అందుకోబోతున్నారు. ప్రతి ఏటా రూ.3.37 కోట్లు వీరి కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. ఈ పింఛన్‌తోపాటు ఉచితంగానే చికిత్సలు, మందులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
సిరిసిల్ల: చిన్న దోమకాటుతో బోదకాలు వ్యాధి సంక్రమిస్తుంది. క్యూలెక్స్‌ ఫాటిగాన్స్‌ జాతికి చెందిన దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తిని దోమకాటు వేసినపుడు అది పీల్చే రక్తంతోపాటు మిల్లిమీటర్లలో ఐదవ వంతు సైజు ఉండే మైక్రొ ఫైలేరియా జీవులు దోమపొట్టలోకి ప్రవేశిస్తాయి. దోమ శరీరంలో లార్వాగా మారి ఇతర వ్యక్తులను కుట్టినపుడు వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలా బోధకా లు వ్యాధి వ్యాపిస్తుంది. ప్రభుత్వం ఇలాంటి వారికి కూడా ఆసరా పింఛన్లు కల్పించాలని నిర్ణయించడంతో బోదకాలు బాధితులు ఆనం దాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
వ్యాధిగ్రస్థుల్లో 6వ స్థానం..
రాష్ట్రంలో 46,476 మంది బోధకాలు వ్యాధిగ్రస్థులున్నారు.రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 6వ స్థానంలో ఉంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల 6463మంది బాధితులతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండేది. సిరిసిల్ల 2812 మంది బాఽధితులతో ఉంది. వీరికి ఆసరా పింఛన్ల ద్వారా ప్రతి నెలా రూ.28.12 లక్షల పింఛన్‌ అందుకోబోతున్నారు. ప్రతి ఏటా రూ 3.37 కోట్లు బోదకాల బాధితులకు జిల్లాలో పించన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 1,14,976 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో వృద్ధాప్యం 31,187, దివ్యాంగులు 10,516, వితంతువులు 22,089, గీతా కార్మికులు 2,142, బీడీ కార్మికులు 43,435 ఒంటరి మహిళలు 1,804, చేనేత కార్మికులు 3,803 మంది ఉన్నారు. వీరితో కలిపి రాబో యే ఆర్థిక సవత్సరంలో బోదకాల బాధితులకు 2812 మందికి పింఛన్లు రాబోతున్నాయి.
 
జిల్లాలో తీవ్రత ఎక్కువే...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2,812 మంది ఉండగా కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లెక్కలు పరిశీలిస్తే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తుంది. జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంట ప్రాథమిక ఆరో గ్య కేంద్రం పరిధిలో 476 మంది ఉన్నారు. చీర్లవంచలో 153 మంది, నేరెళ్లలో 138 మంది, తంగళ్లపల్లిలో 121 మంది, కోనరావుపేటలో 220, గంభీరావుపేటలో 212, పోత్గల్‌లో 243, ఎల్లారెడ్డిపేటలో 186 మంది, వేములవాడలో 325, బోయిన్‌పల్లిలో 174 మంది, కోదురుపాకలో 51, విలాసాగర్‌లో 113 చందుర్తి 274 మంది, సిరిస్లిలలో 126 మంది బోదకాల బాధితులు ఉన్నారు. వీరికి ఆసరా పింఛన్‌ రావడంతోపాటు ఉచితంగానే చికిత్సలు, మందులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.