డుమ్మా డాక్టర్లపై సర్కారు ఆగ్రహం..

134 మంది వైద్యులకు తాఖీదులు!

ఇటీవలే కొందరిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో విధులకు ఎగనామం పెడుతున్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా టీవీవీపీ ఆస్పత్రుల్లో 134 మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ సంజాయిషీ కోరుతూ జూన్‌ 1న నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రుల్లోని స్పెషలిస్టు వైద్యులు పనివేళల్లో వారి సొంత క్లినిక్‌లలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరితో పాటు.. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కొందరు డుమ్మా డాక్టర్లనూ సస్పెండ్‌ చేశారు. కాగా.. టీవీవీపీ వైద్యులకు నోటీసులు జారీ కావడంపై హెల్త్‌కేర్‌ రిఫార్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారిని సచివాలయంలో కలిసింది. నోటీసులు ఇచ్చిన 134 మంది వైద్యులు విధులకు గైర్హాజరవ్వడానికి కారణాలున్నాయని.. పోస్టింగ్స్‌ ఇచ్చే ముందు ఎలాంటి కౌన్సెలింగ్‌ నిర్వహించలేదని పేర్కొంది. పోస్టింగ్స్‌లో మార్పులు చేయలేదని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే టీవీవీపీకి కమిషనర్‌గా వైద్యుడినే నియమించాలని డిమాండ్‌ చేసింది. భాగస్వాములు, మ్యూచువల్‌ బదిలీలకు అవకాశం కల్పించాలని.. గతంలో నియమితులైన 91 మంది జీడీఎంవోలకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని కోరింది.