ఆకలిని తగ్గించే మంచి నిద్ర!

08-06-2019: కంటి నిండా నిద్ర పోవడం వలన తీపి, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినాలన్న కోరిక, ఆకలి తగ్గిపోతుందని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. స్లీప్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో వారు ఈ విషయాలు వెల్లడించారు. రోజుకు ఏడు గంటలకంటే తక్కువ నిద్రపోయేవారికి జీవక్రియ దెబ్బతిని గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే.. నిద్రకు అధిక సమయాన్ని కేటాయించడం వలన ఆ సమస్యలను అధిగమించవచ్చు.
 
అంతేకాకుండా మంచి నిద్ర వలన చక్కెర, అధిక కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలన్న కోరిక తగ్గిపోతుందని కేప్‌టౌన్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాబ్‌ హెన్సెట్‌ తెలిపారు. ఎక్కువసేపు నిద్రపోవడం వలన ఇన్సులిన్‌ సెన్సివిటీ చర్యలు మెరుగై.. ఇది ఓవరాల్‌గా ఆకలిని తగ్గిస్తుందని, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినాలన్న కోరికను హరిస్తుందని ఆయన చెప్పారు.