పేద గుండెకు మరింత భరోసా..!

కొత్తగా 10 క్యాథ్‌ల్యాబ్‌ సేవలు
జూన్‌ నుంచి అమలుకు సిద్ధం
ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో 1059కి పెరుగనున్న శస్త్ర చికిత్సలు
బోధనాస్పత్రుల్లోనూ ‘గుండె మార్పిడి’

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య సేవ.. పేదోడి ఆరోగ్యానికి కొండంత భరోసా..! వైద్యసేవ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటికే 1044 వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మరో 15 సేవలను అదనంగా చేర్చనుంది. కొత్తగా 10 క్యాథ్‌ల్యాబ్‌ సేవలను ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. వాటితోపాటు గుండె మార్పిడి (హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌)కి సంబంధించి మరో మూడు సేవలు, ప్రసూతి వైద్యానికి సంబంధించి మరో 2 సేవలను కూడా చేర్చాలని నిర్ణయించింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న క్యాథ్‌ల్యాబ్‌ సేవలను జూన్‌ నుంచే అమలు చేసేందుకు వైద్య సేవ ట్రస్ట్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి టారిఫ్‌ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సేవలు అందుబాటులోకి వస్తే పేదోడి గుండెకు మరింత భరోసా లభించినట్టే. ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా పదుల సంఖ్యలో గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తోంది. దీని వల్ల లక్షల మంది గుండెజబ్బు రోగులు ఉచితంగా చికిత్స పొందుతున్నారు.

గుండె మార్పిడి సేవల విస్తరణ
ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు భారీ ఖర్చుతో కూడుకున్నవి. అయితే 2018 నుంచే హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సలను అందిస్తున్న ట్రస్ట్‌ ఒక్కో శస్త్రచికిత్సకు రూ.11 లక్షల ప్యాకేజీని అందిస్తోంది. అయితే వీటిని కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్న గుండె మార్పిడి చికిత్సలు మొత్తం ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ కిందనే చేస్తున్నారు. గుండె మార్పిడితో పాటు హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఇన్ఫెక్షన్‌, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ రిజెక్షన్‌ శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై ట్రస్ట్‌ ఎక్కడా ప్రచారం చేయలేదు.
 
ఇక నుంచి వీటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. మరోవైపు ఈ సేవలను బోధనాస్పత్రులకూ విస్తరించేందుకు ట్రస్ట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే క్యాథ్‌ల్యాబ్‌లున్నాయి. విజయవాడలో కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఒక క్యాథ్‌ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఈ నాలుగు జిల్లాల్లోని క్యాథ్‌ల్యాబ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రస్ట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.