ముద్దుతోనూ గనేరియా!

వాషింగ్టన్‌, జూలై 18: గనేరియా అనేది లైంగిక సంక్రమణం ద్వారా సంభవించే వ్యాధి. యాంటీబయాటిక్‌లకు కూడా లొంగనటువంటి ఈ అంటువ్యాధి జననాంగాల వద్ద సున్నితమైన పొరలను దెబ్బతీసి, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పిని కలిగిస్తుంది. అయితే ఇప్పటి వరకూ లైంగిక సంబంధం ద్వారానే సంక్రమిస్తుందని భావిస్తున్న ఈ అంటువ్యాధి ముద్దు వలన కూడా వ్యాపించే అవకాశాలున్నాయని అమెరికాలోని మోనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. ‘గనేరియా అనేది వేగంగా పెరుగుతుందన్న విషయం గమనించాలి. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతోపాటు దీన్ని ఎలా నియంత్రించాలో అర్థం చేసుకోవడం కూడా కీలకమే. ముద్దు వలన కూడా ఈ ప్రమాదకర అంటువ్యాధి వ్యాప్తి చెందుతని అవగాహన కలిగించాలి. దాని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్‌ మౌత్‌ వాష్‌ వంటి కొత్త నియంత్రణ పద్ధతులను అనుసరించాలి’ అని మోనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కిట్‌ ఫెయిర్లీ అన్నారు.