స్టెంట్లపై స్టంట్లు!

 అడ్డగోలు ధరలతో అసలు ‘గుండె పోటు’
ధరల నియంత్రణకు ఏడీఈహెచ్‌ డిమాండ్‌
ఉండాల్సిందేనన్న డాక్టర్లు
అవసరం లేకున్నా వాడకం
అసలు ధరకు పది రెట్లు అధికం
అసలు ధర 15 వేలు నుంచి 40 వేలు
ఆస్పత్రుల్లో అమ్మేది 2 లక్షల వరకు
ఆస్పత్రి ఆస్పత్రికీ మారుతున్న ధర
ఎమ్మార్పీ లేకపోవడమే అసలు కారణం
డాక్టర్‌ కమీషనే 20 వేలు-50 వేలు
దేశంలో రూ.16 వేల కోట్ల వ్యాపారం
ఏటా 5 లక్షల స్టెంట్ల అమ్మకం
హైదరాబాద్‌లోనే 10 వేలకుపైగా
 
 
హైదరాబాద్‌ సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో నిమ్స్‌కు వెళ్లాడు ఆదికేశవ. ప్రాణాపాయం నుంచి బయటపడినా, గుండె వాల్వ్‌ పూడుకుపోయిందని డాక్టర్లు చెప్పారు. రెండు స్టెంట్లు వేస్తే ఇక భయముండదని భరోసా ఇచ్చారు. ఒక్కో స్టెంట్‌కు రూ.60 వేలు అవుతుందని చెప్పారు. అమ్మో.. అంతా అనుకుంటూ ఆదికేశవ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఒక్కో స్టెంటు రూ.1.25 లక్షలు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత వైద్యం మంచిగా చేస్తారని భావించి ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఒక్కో స్టెంట్‌కు లక్షన్నర అవుతుందని.. రెండు స్టెంట్లకు మూడు లక్షలు.. ఆపరేషన్‌, రూమ్‌ ప్యాకేజీ కలిపి మరో 2.5 లక్షలు అవుతుందని తేల్చి చెప్పారు. దాంతో ఇంతకీ స్టంటు ధర ఎంతో ఆదికేశవకు అర్థం కాలేదు. ఆస్పత్రి ఆస్పత్రికి స్టంటు రేటు మారుతుండడంతో దిక్కుతోచలేదు.
 
ఒక్క ఆదికేశవ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమందిని త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తున్న అంశమిది. మన దేశంలో కడుపు నొప్పి మందుకు ఎమ్మార్పీ ఉంది. కాలు నొప్పి మందుకు ఎమ్మార్పీ ఉంది! కానీ, మనిషి ప్రాణాన్ని నిలబెట్టే ‘స్టెంటు’కు మాత్రం ఎమ్మార్పీ లేదు! ఏ మందు మంచిదో.. ఏ మందు వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయో ఒక అంచనా ఉంది. కానీ, ఏటా 5 లక్షలు అమ్ముడుపోయే స్టెంట్ల విషయంలో మాత్రం నాణ్యత నిర్ధారణ లేదు! ఏవి మంచివి!? ఏవి కాదనే అంచనా లేదు! డాక్టర్‌ చెప్పిందే వేదం! స్టెంటు వేయించుకోకపోతే ప్రాణం పోతుందనే భయంతో ఖర్చు ఎంతయినా ఎవరూ వెనకాడడం లేదు. ఇది వేల కోట్ల వ్యాపారానికి నాంది పలుకుతోంది.
 
16 వేల కోట్ల వ్యాపారం 
దేశవ్యాప్తంగా ఒక్క స్టెంట్లతోనే రూ.16 వేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్డియో వాస్క్యులర్‌ సదస్సులో దీనికి సంబంధించి దిగ్ర్భాంతి గొలిపే అంశాలను వెల్లడించారు. నాలుగు దశాబ్దాల క్రితం 4 శాతం భారతీయులకు గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు ఆ సంఖ్య 8 శాతానికిపైగానే పెరిగింది. దక్షిణాదిలో 20 శాతం మంది ఈ రోగం బారినపడే అవకాశం ఉంటే ఉత్తరాదిలో 14 శాతం మాత్రమే! హైదరాబాద్‌కు సంబంధించి ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో మహిళల్లో సైతం సీవీడీ కేసులు గత ఐదేళ్లలో 10-15 శాతం పెరిగాయని వెల్లడించింది. అంతేనా, ఒక్క హైదరాబాద్‌లోనే సాలీనా 10 వేలకు పైగా స్టెంట్లను అమరుస్తున్నారని అంచనా. వీటిలో అధిక శాతం ఇంపోర్టెడ్‌ స్టెంట్లే.
 
10-15 శాతం మాత్రమే ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్‌లో దేశీయ స్టెంట్లు అమరుస్తున్నారు. ఒక్కో స్టెంటు ఖర్చు కనీసం రూ.60 వేల నుంచి 2.5 లక్షల వరకూ ఉంది. ప్రధానంగా అబాట్‌, బోస్టన్‌ సైంటిఫిక్‌, మెడ్‌ట్రానిక్‌ వంటి విదేశీ కంపెనీలు, సహజానంద్‌ టెక్నాలజీస్‌, ట్రాన్స్‌లుమినా వంటి భారతీయ కంపెనీలు వీటిని సరఫరా చేస్తున్నాయి. ఇక, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఏటా 5 లక్షల స్టెంట్లు వేస్తున్నారని అంచనా. ఆపరేషన్‌ ఖర్చులు కూడా కలుపుకొంటే, దేశంలో ఒక్క స్టెంట్ల వ్యాపారమే రూ.16 వేల కోట్ల వరకూ జరుగుతోంది. గత ఐదేళ్లతో పోలిస్తే, స్టెంట్లు వేసే చికిత్సలు ఐదు రెట్లు పెరిగాయి.
 
స్టెంటు.. కామధేనువు.. కల్ప వృక్షం 
స్టెంట్లు మన దేశంలోని డాక్టర్లకు కామధేనువు, కల్ప వృక్షంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ కంపెనీలు, వాటికి వత్తాసు పలికే కార్పొరేట్‌ ఆస్పత్రులు దోచుకుంటున్నాయని రోగులు అంటుంటే.. రోగి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైనవి దిగుమతి చేసుకుని మరీ వాడుతున్నామని డాక్టర్లు అంటున్నారు. అయినా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యాంజియోప్లాస్టీకి అయ్యే ఖర్చు ఎక్కువే. అభివృద్ధి చెందిన దేశాల్లో వాటి ధరల నియంత్రణకు ఒక విధానం ఉండడమే ఇందుకు కారణం. ఉదాహరణకు, జర్మనీలో స్టెంట్‌ ధర 460 డాలర్లు. అయుతే, యూరప్‌ దేశాల్లో ఇది గరిష్ఠంగా 790 డాలర్లు మాత్రమే. అదే స్టెంట్‌ మన దేశంలో 1000 నుంచి 2500 డాలర్లు పలుకుతోంది. నిజానికి, 1994లో ఎఫ్‌డీఏ స్వచ్ఛందంగా స్టెంట్లను అమర్చడానికి అనుమతి ఇచ్చింది.
 
నేషనల్‌ ఇంటర్‌వెన్షనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఐసీ) లెక్కల ప్రకారం 2015లో 5 లక్షల స్టెంట్లను రోగులకు అమర్చారు. ఒక్కో స్టెంటును దిగుమతి చేసుకున్నప్పుడు దాని ధర ఎంతో తెలుసా!? కేవలం రూ.15 వేలు నుంచి రూ.40 వేలు. వీటి దిగుమతికి ప్రభుత్వం ఎలాంటి దిగుమతి సుంకమూ విధించదు. అంతేనా, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌)లో స్టెంట్‌ ధరను రూ.23,625గానే నిర్ణయించారు. కానీ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వచ్చేసరికి డాక్టర్‌కు కమీషన్‌.. ఆస్పత్రి మార్జిన్‌.. ఇతరత్రాలు అన్నీ కలిపి దాని ధర లక్షన్నర నుంచి రెండు లక్షలకు పెరిగిపోతోంది. ‘రోగుల అవసరం’ ప్రాతిపదికగా దీని ధర పెంచేస్తున్నారు. ‘‘ప్రతి స్టెంట్‌ కొనుగోలుపై కార్డియాలజిస్ట్‌కు 15 వేల నుంచి రూ.60 వేల వరకూ కమీషన్‌ ఇస్తుంటాం. కార్డియాలజిస్ట్‌లకు తమ కమీషన్‌ రాకపోతే హాస్పిటల్‌ కొనుగోలు చేసినా ఈ స్టెంట్లు షెల్ఫ్‌లో ఉండిపోవాల్సిందే..! వాటిని వాడరు’’ అని ఓ బడా డీలర్‌ వెల్లడించారు.
 
అదే సమయంలో, ‘‘ప్రాణావసరం కనక ఒక్కో స్టెంటు మీదా 20 శాతం మార్జిన్‌ వేసుకున్నా ఫర్వాలేదు. కానీ, మరీ 10 రెట్లు అధికంగా వసూలు చేయడం ఏం నీతి!?’’ అని ఏలియన్స్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ ఫర్‌ ఎథికల్‌ హెల్త్‌కేర్‌ మండిపడుతోంది. అయితే, మారుతున్న కాలానికి తగినట్లు స్టెంట్లలోనూ మార్పులు వచ్చాయని, బాగా పని చేసే స్టెంట్లను వేయాలంటే ఆమాత్రం ధర భరించక తప్పదని వైద్యులు అంటున్నారు. స్టెంట్లలో చాలా రకాలున్నాయని, వాటిని బట్టి ధర మారుతుంటుందని చెబుతున్నారు. మరి ఎన్ని రకాలైనా ధరను ఐదు నుంచి పది రెట్ల వరకు పెంచడం ఏ మేరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తే.. దారుణమేనని అంగీకరిస్తూనే ఆ ధరలను నియంత్రించాల్సిందేనంటున్నారు. స్టెంట్‌ రకాలు, పనితీరును చూడకుండా అడ్డగోలుగా ధరను నియంత్రిస్తే.. నాణ్యమైన స్టెంట్లు భారతకు రావడం ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
 
స్టెంట్ల ధరలను స్థిరీకరించడంపై వాటి తయారీ సంస్థలు ప్రత్యక్షంగా వ్యతిరేకత తెలపకున్నా.. అన్ని రకాల స్టెంట్లనూ ఒకే గాటన కట్టి ఒకే ధరలు నిర్ణయించడం సరికాదని చెబుతున్నాయి. కొన్ని సాంకేతికంగా అత్యున్నతమైనవని, వాటిని వర్గీకరణ, ఉప వర్గీకరణ చేయాలని సూచిస్తున్నాయి. అయితే, సబ్‌ కేటగిరీలను సృష్టించాలనే వాదనను ధరల స్థిరీకరణ అంశంపై ప్రభుత్వం నియమించిన 17 మంది కార్డియాలజి్‌స్టల కమిటీ కొట్టి పారేసింది. ఇటీవల ఓ సంస్థ మూడు రకాల స్టెం ట్లను అందుబాటులోకి తెచ్చి వాటిలో పెద్ద తేడా ఏమీ లేకున్నా ధరలో భారీ తేడా చూపిందని పేర్కొంది.
 
మనం వాడే రకాలు! 
మెటల్‌ స్టెంట్లు.. వీటిని ఇప్పుడు చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి మొత్తం మీద రెండు శాతం ఉంటాయి. వీటిలో ఎలాంటి డ్రగ్స్‌ ఉండవు.
డ్రగ్‌ ఇల్యూటింగ్‌ స్టెంట్లు.. దేశంలో అధికంగా వినియోగిస్తున్న స్టంట్‌లు ఇవే. 95% వీటినే వాడుతున్నారు. రక్తనాళాల్లో మళ్లీ అడ్డంకులు ఏర్పడకుండా ఈ స్టెంట్లకు మందుపూత వేస్తారు. కొన్ని డ్రగ్స్‌ కూడా అంతర్భాగంగా ఉంటాయి.
బయోడీగ్రేడబుల్‌ స్టెంట్లు.. వీటి వినియోగమూ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వీటిని వేశాక కొన్నేళ్లకు అవి శరీరంలో కలిసిపోతాయి.నియంత్రణ వస్తే ధరలు తగ్గుతాయా ?
 
అవసరం లేకున్నా వేస్తున్నారు!
డ్రగ్‌ ఎల్యూటెడ్‌ స్టెంట్లలో రసాయనాల పూత ఆధారంగా నాలుగు రకాలు ఉంటాయి. సుప్రాలిమస్‌, ఎవరోలిమస్‌, జటరోలిమస్‌, ప్యాకిలి టాక్సిల్‌ వంటి మందుల పూతల ఆధారంగా ఈ రకాలుంటాయి. ఈ మందుల పూతను బట్టి ధరల నిర్ణయం ఉంటుంది. అయినా కొన్ని ఆసుపత్రుల్లో పది శాతం వరకు నాణ్యత లేని స్టెంట్లను వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు అవసరం లేకున్నా ఎక్కువ ధర చెప్పి తక్కువ ధర ఉన్న స్టెంట్లు వేస్తున్నారు. సాధారణంగా ఎఫ్‌డీఎఫ్(ఫుడ్‌ ఆఫ్‌ డ్రగ్గ్‌ అడ్మినిస్ట్రేషన్‌ యాక్ట్‌), సీఈ(కార్పొరేట్‌ ఈరోపియన్‌) సంస్థలు అమోదించిన స్టెంట్లను మాత్రమే వినియోగించాలి. 
-డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్థి, క్యాథాలబ్‌ సర్వీస్‌ డైరెక్టర్‌, అపోలో ఆస్పత్రి
 
ధరలు తగ్గాలి.. కానీ 
స్టెంట్‌ ధరలను కచ్చితంగా తగ్గించాల్సిందే. అయితే అది క్వాలిటీ మీద ప్రభావం చూపకుండా ఉండాలి. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ హ్యాండ్లింగ్‌ చార్జీలను అధికంగా వసూలు చేస్తున్నాయనే వాదన ఉంది. ఆ అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆయా కంపెనీలు అడ్వాన్స్‌డ్‌ పేరిట చేసే మార్పులేమీ ఉండటం లేదనే వాదన కొంత మేరకు సరైనదే, కానీ అసలు మార్పులేవీ చేయడం లేదనడం మాత్రం తప్పు. 
-ప్రొఫెసర్‌ శేషగిరిరావు, హెచ్‌ఓడీ, కార్డియాలజీ, నిమ్స్‌
 
ఆధునికతనూ జోడించాలి.. 
ధర నియంత్రణ మంచిదే కానీ అన్నిటినీ ఒకే గాటన కట్టకుండా ఉండాలి. మెడికేటెడ్‌ స్టెంట్స్‌ను విభాగాలు చేస్తే బాగుంటుంది. అలా చేస్తేనే రోగులకు ఉపయోగం. 
- డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, స్టార్‌ హాస్పిటల్‌