ద్రాక్ష పళ్లను తింటున్నారా?

ఆంధ్రజ్యోతి, 17-02-2017: సూక్ష్మ పోషకాల నిధి ద్రాక్ష. ఇందులోని రాగి, ఇనుము, మాంగనీస్‌ ఎముకల ధృడత్వానికి దోహదపడతాయి. రోజు కొన్ని ద్రాక్షపళ్లు నోట్లో వేసుకుంటే.. వయసుతో పాటు వచ్చే ఆస్టియోపొరోసిస్‌ సమస్యలు తగ్గుతాయి. శరీర ఆరోగ్యానికి మాంగనీస్‌ అత్యంత ప్రాధాన్యం. దీనివల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది. నరాల పనితీరు సక్రమంగా ఉంటుంది. 

రక్తంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ స్థాయిలను పెంచే గుణం ద్రాక్ష పళ్ల సొంతం. దీనివల్ల బ్లడ్‌క్లాట్స్‌ సమస్య తగ్గుతుంది. తద్వార గుండెపోటు సమస్యకు అడ్డుకట్ట పడుతుంది.

శరీరంలో ఎప్పటికప్పుడు పెరిగిపోయే చెడుకొవ్వును తగ్గించే యాంటీఆక్సిడెంట్స్‌ ద్రాక్షలో ఉన్నాయి. రక్తనాళాల్లోని అడ్డంకులను కూడా తొలగించే స్వభావం వీటికి ఉంది.

ఉదయాన్నే ఒక గ్లాసు ద్రాక్షపళ్ల రసం తాగితే మైగ్రేన్‌ తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పికి రకరకాల కారణాలైన నిద్రలేమి, వాతావరణ మార్పు, పోషకాహార లోపం వంటివి తగ్గుతాయి.

మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్లకు ద్రాక్ష చక్కగా ఉపకరిస్తుంది. ఎందుకంటే ఇందులో ఆర్గానిక్‌ యాసిడ్‌, సుగర్‌, సెల్యులోజ్‌ వంటివి ఉంటాయి. ద్రాక్షతో అత్యధికంగా పీచు కూడా లభిస్తుంది.

రెండు టీస్పూన్ల ఉప్పు కలిపిన నీటిలో ద్రాక్షపళ్లను వేసి.. అరగంట తరువాత శుభ్రమైన నీటితో కడిగి తింటే మంచిది.

ఈ పళ్లకు చర్మకాంతిని పెంచే గుణం ఎక్కువ. విటమిన్‌- సి పుష్కలంగా ఉంటుంది వీటిలో.