కుక్కకు కేన్సర్‌.. కీమో వైద్యం

 కాకినాడ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఓ శునకానికి వెటర్నరీ డాక్టర్లు కీమో థెరపీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన సునీల్‌కుమార్‌ పొమరేనియన్‌ జాతికి చెందిన ఒక కుక్కను ఎనిమిదేళ్లుగా పెంచుతున్నారు. అయితే.. ఆరు నెలలుగా అది సరిగ్గా తిండి తినకుండా రోజురోజుకూ నీరసించిపోతుండడంతో సునీల్‌కుమార్‌ దాన్ని సామర్లకోట పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తాత్కాలికంగా కొన్ని మందులు ఇచ్చారు. దానికి సోకిన వ్యాధి ఏమిటో నిర్ధారించలేక..కాకినాడ పాలీక్లినిక్‌కు తీసుకెళ్లమని సూచించారు.
 
ఆ ఆస్పత్రిలోని వైద్యుడు కృష్ణమూర్తి.. ఆ శునకం రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఇప్పుడు దానికి కీమో థెరపీ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో దాని ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పారు. కాగా.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆ మూగజీవానికి చికిత్స చేయిస్తున్న సునీల్‌కుమార్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.