ఒక్కరోజులో 21,671 మందికి దంత పరీక్షలు

విజయవాడ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దంత సంరక్షణపై అవగాహన కల్పించేందుకు డాక్టర్‌ శ్రీధర్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం నిర్వహించిన మెగా దంత వైద్య శిబిరం గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. ఆంధ్ర లయోలా కాలేజీ ఆడిటోరియంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో 500 మంది వైద్యులు పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా 21,671 మందికి దంత పరీక్షలు నిర్వహించారు. అనేక పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ విభాగం దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద దంత వైద్య శిబిరంగా గుర్తించింది. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు ప్రపంచ రికార్డుకు సబంధించిన సర్టిఫికెట్‌ను శ్రీధర్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, కృష్ణాజిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.