ఆస్పత్రి నేలమీదే ప్రసవం

గర్భిణీని చేర్చుకోని వైద్యులు.. ఆయాల సాయంతో డెలివరీ
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

సంగారెడ్డి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి పట్ల నిర్లక్ష్యం చూపారు ఆ వైద్యులు. రంజాన్‌ పండుగ కదా అత్యవసర విభాగంలో చేర్చుకోలేమని ఒక మహిళా డాక్టర్‌ వెళ్లిపోగా.. వైద్యుల సూచన లేకుండా అడ్మిషన్‌ ఎలా తీసుకున్నారంటూ వైద్యం చేసేందుకు నిరాకరించింది మరో మహిళా డాక్టర్‌. పురిటినొప్పులతో బాధపడుతున్న భార్య అవస్థ చూడలేక ఆమె భర్త కాళ్లావేళ్లా పడ్డ వినిపించుకోలేదు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆస్పత్రి నేల మీదే ప్రసవించింది. కాయకల్ప చికిత్సలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బీబీ తండాకు చెందిన ఎన్‌.స్వాతి బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చినా సాయంత్రం వరకు వైద్యులు పట్టించుకోలేదు. జిల్లా సూపరింటెండెంట్‌తో స్వాతి భర్త ఫోన్‌ చేయించినా వైద్యం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయాల సాయంతో నేల మీదే పండంటి పాపకు స్వాతి జన్మనిచ్చింది. దీనిపై సూపరింటెండెంట్‌ సంగారెడ్డిని వివరణ అడగ్గా.. సదరు డాక్టర్‌కు మెమో ఇస్తామని చెప్పారు.