ఔషధ ప్రయోగాలు నైతికమే!

260 మందిపై 5 మందుల ట్రయల్స్‌
ప్రస్తుతం రోటా వైర్‌సపై కొనసాగింపు
నిలోఫర్‌లో త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి
డీఎంఈకి ప్రాథమిక నివేదిక సమర్పణ

హైదరాబాద్‌/మంగళ్‌హాట్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎథికల్‌ కమిటీ, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నిబంధనల ప్రకారమే నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇప్పటి వరకూ 260 మందిపై 5 రకాల ప్రయోగాలు జరిగినట్లు నిర్ధారించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... స్వైన్‌ ఫ్లూ సహా ఐదు రకాల రోగాలకు సంబంధించిన మందులను రోగులపై ప్రయోగించినట్లు తెలిసింది. 

ప్రస్తుతం రోటా వైరస్‌ మందులపై ప్రయోగాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎనిమిది మంది చిన్నారులపై ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ మేరకు సమాచారాన్ని త్రిసభ్య కమిటీ సేకరించింది. నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారులపై నిబంధనలకు విరుద్ధంగా క్లినికల్‌ ట్ర యల్స్‌ జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది.
 
కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రి జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ రాజారావు, నిజామాబాద్‌ ఫార్మకాలజికల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ లక్ష్మీకామేశ్వరి, డాక్టర్‌ విమలా థామస్‌ సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 2.45 వరకూ నాలుగు గంటలపాటు విచారణ జరిపారు. నిలోఫర్‌ పిడియాట్రిక్‌ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రవికుమార్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలతోపాటు సిబ్బంది, పీజీ విద్యార్థులను ఒక్కొక్కరిగా విచారించారు. గతంలో ప్రయోగాలు జరిపిన పలువురు చిన్నారులను, వారి తల్లిదండ్రులను ముందుగానే పిడియాట్రిక్‌ విభాగానికి పిలిపించి విచారించారు.
 
కాగా, ఎథికల్‌ కమిటీ నిబంధనల ప్రకారమే నిలోఫర్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయని, రికార్డుల్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో సమయం ఎక్కువ తీసుకుందని కమిటీ సభ్యుల్లో ఒకరు తెలిపారు. డాక్టర్ల మధ్య విభేదాల కారణంగానే ఈ అంశం వివాదాస్పదమైందని అభిప్రాయపడ్డారు. సేకరించిన సమాచారంపై సాయంత్రానికే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌ రెడ్డికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. కాగా, కమిటీ విచారణ సరిగా లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు, నిలోఫర్‌ ఆర్‌ఎంవో లాలుప్రసాద్‌ రాథోడ్‌ ఆరోపించారు.
 
5 ట్రయల్స్‌ జరిగితే 5 గంటల్లో నిజానిజాలు ఎలా తేల్చగలిగారని ప్రశ్నించారు. అసలు వ్యవహారం బయటకు రావాలంటే సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాగా, కమిటీ అడిగిన అన్ని పత్రాలను అందజేశానని నిలోఫర్‌ ఆస్పత్రి పిడియాట్రిక్‌ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకూ నాలుగు ట్రయల్స్‌ పూర్తయ్యాయని, ప్రతి అంశాన్ని కమిటీ ముందుంచామన్నారు.
స్వైన్‌ ఫ్లూ మందులు వాడారు... - సోని, చిన్నారి తల్లి, మెహిదీపట్నం
 
క్లినికల్‌ ట్రయల్స్‌పై కొత్త విధానం!
క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ట్రయల్స్‌ వివరాలు ఎథికల్‌ కమిటీల వద్ద మాత్రమే ఉంటున్నాయి. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ వద్ద ఎలాంటి సమాచారం ఉండడంలేదు. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న ట్రయల్స్‌పై కనీస సమాచారం కూడా అధికారుల వద్ద ఉండడం లేదు. మరోవైపు, క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను వారం రోజుల్లో అందజేయాలని వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఎథికల్‌ కమిటీలను సోమవారం ఆదేశించారు.