మీ కిడ్నీని రూ.3 కోట్లకు కొంటాం

రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.కోటి వసూలు
తమిళనాట ఆన్‌లైన్‌ దగా వ్యాపారం
500 మందికిపైగా బాధితులు
వీరిలో ఏపీ, తెలంగాణవారు కూడా

చెన్నై, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మానవ దేహంలో అత్యంత కీలకమైన కిడ్నీలతో వ్యాపారం చేస్తూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఈరోడ్‌లో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను ప్రారంభించి రూ.3 కోట్లకు కిడ్నీ కొనుగోలు చేస్తామంటూ ఓ ముఠా 500 మందిని మోసం చేసింది. ముఠా సభ్యులు.. బాధితుల నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజుల రూపంలో రూ.కోటికి పైగా వసూలు చేశారు. ఈరోడ్‌ సంపత్‌ నగర్‌లో కల్యాణి కిడ్నీ కేర్‌ ఆసుపత్రి నడుస్తోంది. ఆ ఆసుపత్రి పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ఖాతాను ప్రారంభించి ఆకర్షణీయమైన ప్రకటనను వెలువరించారు. కిడ్నీలను దానం చేసేవారు తమ ఖాతాలో రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకుంటే, అవసరమైనప్పుడు కిడ్నీని తీసుకుని రూ.3 కోట్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే కిడ్నీ దానం చేయదలచినవారు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల దాకా చెల్లించాలని ఆ ప్రకటనలో తెలిపారు.

దీనిని చూసిన ఈరోడ్‌, సేలం, కోయంబత్తూరు, నామక్కల్‌, తిరుచ్చి, కరూరు తదితర జిల్లాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అనేక మంది రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు 500 మంది నుంచి ఆ ముఠా రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ముఠా ఇంకా పలు నగరాలలోని ప్రముఖ కిడ్నీ ఆసుపత్రుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఖాతాలు ప్రారంభించి మోసాలకు పాల్పడినట్లు ఈరోడ్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించిన ఒక మహిళ కల్యాణి కిడ్నీ కేర్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేయడంతో ఈ మోసం బయటపడింది. ఈ ముఠా హైదరాబాద్‌లోనూ మోసాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.