కడుపులో బ్యాండేజీ మరిచి కుట్లేశారు

శస్త్రచికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం

మహిళ మృతి: హెచ్చార్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడుకు చెందిన హరిత గర్భిణి. నిరుడు అక్టోబరు 3న ప్రసవం కోసం షాద్‌నగర్‌లోని విజయ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. సర్జరీ సమయంలో వైద్యులు బ్యాండేజీ క్లాత్‌, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా వైద్యులు మే 27న శస్త్రచికిత్స చేసి కడుపులోంచి బ్యాండేజీ క్లాత్‌ను, ఇతర వ్యర్థ పదార్థాలను తీశారు. అప్పటికే పేగులు విషపూరితం కావడం వల్ల జూన్‌ 15న ఆమె మరణించింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన సోదరి మృతి చెందిందని ఆమె సోదరుడు రవి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదులో.. ‘ప్రసవం కోసం వెళితే శస్త్ర చికిత్స పేరుతో కడుపులో బ్యాండేజీ క్లాత్‌, దూది ఉంచే కుట్లు వేశారు. దీంతో నా సోదరి ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసినా.. వైద్యులకే సహకరించారు. అందుకు ఆ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రైవే టు ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి’ అని కోరాడు. ఈ మేరకు హెచ్చార్సీ రంగారెడ్డి ఆరోగ్యశాఖ జిల్లా కోఆర్డినేటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగస్టు 28లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.