‘తల్లి సురక్ష’ ద్వారా నాణ్యమైన ప్రసవాలు

55 లక్షల కుటుంబాలకు మేలు
ఏపీలోనే తొలిసారి.. దేశంలో మరెక్కడా లేదు
ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్‌ పూనం

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద గర్భిణులందరికీ ఉచితంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ సేవలు ప్రారంభించామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. మాతృ, శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘తల్లి సురక్ష’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

దీంతో రాష్ట్రంలో మాతృ, శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గడంతోపాటు గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ 50 పడకలు ఉంటనే నెట్‌వర్క్‌ ఆస్పత్రిగా అనుమతి ఇస్తోందని, దాన్ని 10 పడకలకు కుదించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ప్రసూతి సేవల కోసం రాష్ట్రంలో 10 పడకల ఆస్పత్రులను కూడా నెట్‌వర్క్‌ పరధిలోకి తీసుకువస్తామన్నారు. అయితే, తాము సూచించిన నియమ నిబంధనల ప్రకారం ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటేనే ప్రసూతి సేవలకు అనుమతి ఇస్తామన్నారు. ముఖ్యంగా వైద్య, నర్సింగ్‌ సిబ్బంది, ప్రసూతికి అవసరమైన అత్యవసర వైద్య పరికరాలు ఉంటేనే ట్రస్ట్‌ నుంచి అనుమతులు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో 10 పడకల నర్సింగ్‌ హోమ్‌లు గ్రామీణ స్థాయికి కూడా విస్తరించాయన్నారు.
ఇక బిల్లుల గోల ఉండదు..
ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్)కు ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవని పూనం చెప్పారు. ఈహెచ్‌ఎస్‌ కోసం ప్రత్యేకంగా ఎస్ర్కో అకౌంట్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇకపై ఉద్యోగులు హెల్త్‌ కార్డుకు చెల్లించే మొత్తాన్ని ఆ అకౌంట్‌లో భద్రపరుస్తామన్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఈహెచ్‌ఎస్‌ బిల్లులు పెండింగ్‌ పడినప్పుడు ఈ అకౌంట్‌ నుంచి చెల్లిస్తామని చెప్పారు. ఇకపై బిల్లుల గోల ఉండదని వివరించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి క్లైయిమ్స్‌ ట్రస్ట్‌కు రాగానే 50 శాతం ముందే చెల్లిస్తామని చెప్పారు. ఆశా ఆస్పత్రుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.