ఆయుష్మాన్‌ భవ!

స్వాస్థ్య భారత్‌కు పెద్ద పీట.. ఆరోగ్య రంగానికి 62.65 వేల కోట్లు
ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.6,400 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 5: ఆరోగ్య భారతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. ఇందులో భాగంగా ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.62,659.12 కోట్లు వ్యయం చేయనున్నారు. 2018-19లో ఈ రంగానికి రూ.52,800 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం 18.67 శాతం నిధులను పెంచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌- ప్రధానమంత్రి జన ఆరోగ్య బీమా(ఏబీ-పీఎంఏజేవై) పథకానికి ఇందులో రూ.6,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5లక్షల విలువైన ఆరోగ్య బీమా అందనుంది. జాతీయ పట్టణ ఆరోగ్య పథకం(ఎన్‌యూహెచ్‌ఎం) కింద ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలకు రూ.240.96 కోట్లు కేటాయించారు. ఎన్‌యూహెచ్‌ఎం ద్వారామరో రూ.1,349.97 కోట్లతో కొత్త వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ ఆరోగ్య పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.32,995 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు రూ. 156కోట్లు, జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతంలో ఎయిమ్స్‌కు రూ.3,018 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,599.65 కోట్లు కేటాయించారు. జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా మార్చేందుకు రూ. 2వేల కోట్లు.. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల అభివృద్ధికి రూ.1,361 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమాభిృద్ధి శాఖ(డబ్ల్యూసీడీ)కు నిర్మల పెద్దపీట వేశారు. ఈ శాఖకు రూ.29 వేల కోట్లు కేటాయించారు.

2018-19 ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది 17 శాతం (రూ.24,758.62 కోట్లు) ఎక్కువ. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)కింద గర్భిణులకు, బాలింతలకు(శిశువు బతికి ఉండాలి) రూ.6 వేలు ఇస్తారు. ఇక, భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం బడ్జెట్‌లో స్పష్టంగా కనపడింది. ఇందులో భాగంగానే ఆయుర్వేద, యోగా, ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ, హోమియోపతి(ఆయుష్‌) వైద్య రంగాలకు రూ.1,939.76 కోట్లు కేటాయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి చేసిన కేటాయింపులు నిరాశ పరిచాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.