మందుల చీటీలకూ ఆడిట్‌!

యాంటీబయాటిక్‌ నిరోధకతపై కేంద్రం పోరు 
 
ప్రజల్లో అవగాహనకు 22 నుంచి ప్రచారోద్యమం 
వ్యూహాల రూపకల్పనలో 4 శాఖలు
 
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ మందులకు సైతం లొంగకుండా సూక్ష్మజీవులు అత్యంత శక్తిమంతంగా మారడాన్ని (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌-ఏఎంఆర్‌) కేంద్రం అతిపెద్ద సవాలుగా పేర్కొంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 22న ఒక ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఏఎంఆర్‌ సవాల్‌ను సమర్థంగా నిరోధించే వ్యూహాల రూపకల్పనలో నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు పాలుపంచుకోనున్నాయి. వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, పర్యావరణ శాఖతో పాటు.. రసాయనాలు ఎరువుల శాఖలోని ఫార్మాస్యూటికల్స్‌ విభాగం కూడా ఈ పరిధిలోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఏఎంఆర్‌ సమస్యను ఎదుర్కొనే క్రమంలో భాగంగా.. ప్రిస్ర్కిప్షన్‌ ఆడిట్‌ (వైద్యులు రాసే మందుచీటీల పరిశీలన) చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. కూడా యోచిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల చీటీల పరిశీలన సాధ్యమేగానీ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో అది అంత సులభమైన పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై తాము ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అలాగే.. ఏఎంఆర్‌పై ఇప్పటికే మూడు కమిటీలు పనిచేస్తున్నాయని.. సవివరమైన మార్గదర్శకాలను ఆ కమిటీలు రూపొందిస్తున్నాయని వచ్చే నెల నాటికి ఆ మార్గదర్శకాలు తమకు అందే అవకాశం ఉందని మిశ్రా పేర్కొన్నారు. ‘ఈ సమస్యను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించిన విధానాలను అత్యంత కఠినంగా రూపొందించనుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రతి ఆస్పత్రిలో రోగులకు వైద్యులు రాసే మందుల చీటీలను ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారని మిశ్రా తెలిపారు. వాటన్నిటినీ పరిశీలించడం వల్ల యాంటీబయాటిక్‌ మందులను ఏ స్థాయిలో వాడుతున్నారో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 3, 4వ తరం యాంటీబయాటిక్‌ మందుల విక్రయాల రికార్డులను మందులషాపులు మూడేళ్లపాటు ఉంచాలని.. నిబంధనలను ఉల్లంఘించేవారి షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని మరో అధికారి హెచ్చరించారు.