ఆరోగ్య పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు

అన్ని పథకాలకు ఏటా రూ. 2 వేల కోట్లు ..

వివిధ పథకాల ద్వారా కోటి కుటుంబాలకు లబ్ధి
ఒక్కో పథకానికి ఒక్కో రకంగా సేవలు
అన్నింటినీ ఒకే పరిధిలోకి తెచ్చే యోచన
ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఆదేశం

హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివి ధ వర్గాల ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య పథకాలన్నింటి ని ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోం ది. సాధ్యాసాధ్యాల అమలుపై అధ్యయనం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన వివి ధ అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.04 కోట్ల కుటుంబాలున్నాయని సమగ్ర సర్వే చెబుతోంది. అందులో వివిధ ఆరో గ్య పథకాల కింద సుమారు కోటి కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అయితే వివిఽధ ఆరోగ్య పథకాల కింద ప్రభుత్వం ఏటా సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికి లబ్ధిదారులు సంతృప్తిగా లేరు.ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం వద్ద డబ్బులు తీసుకుంటూ నాణ్యమైన వైద్య సేవలందించడం లేదన్న భావన సర్కారులోనూ, లబ్ధిదారుల్లోనూ నెలకొంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, జేహెచ్‌ఎ్‌స, టీఎ్‌సఆర్టీసీ, సింగరేణి, పోలీసుల ఆరోగ్య భద్రత, ఈఎ్‌సఐ పథకాల కిం ద రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య సేవలందుతున్నాయి. వీటన్నింటి ద్వారా దాదాపు కోటి కుటుంబాలు ప్రస్తుతం లబ్ధి పొందుతున్నట్లు సర్కారీ లెక్కలు చెబుతున్నాయి. అయితే వివిధ పథకాల కింద అందుతున్న ఆరోగ్య సేవలకు ఒక్కోరకంగా కేటాయింపులు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద 933 జబ్బులకు వైద్య సేవలందుతున్నాయి. ఈహెచ్‌ఎ్‌స కింద అందే వైద్య సేవల్లో కొన్ని ఆరోగ్యశ్రీ పథకంలో లేవు. అలాగే ఆర్టీసీలో అందే వైద్య సేవల్లో కొన్ని మరొక పథకంలో లేవు. అన్ని రకాల జబ్బులు, శస్త్ర చికిత్సల సేవలను ఒకే గొడగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుం దన్న యోచనలో సర్కారు ఉంది. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ కింద ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఒక శస్త్ర చికిత్సకు ఒక రకమైన ఽధర ఉంటే, అదే శస్త్రచికిత్సకు నిమ్స్‌లాంటి చోట అంతకంటే తక్కువ ధర ఉంది. అలాగే వివిధ పథకాల కింద వర్తించే ఆపరేషన్లలోనూ పలు రకాల ధరలున్నాయి. అన్నింటిని ఒకే పరిధిలోకి తీసు కొస్తే అన్ని చోట్లా ఒకేరకమైన వైద్య సేవలు, చికిత్సల కు ఒకే రకమైన ధరలు ఉండేలా చేయడమే ఈ యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద అందుతోన్న వైద్య సేవలన్నింటిని ఒకే గొడుకు కిందికి తీసుకురావాలంటే కొంచెం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద సేవలందించే చోట పోలీసు, ఉద్యోగుల వైద్య పథకం కింద సేవలు పొందే వారు ఒప్పుకొంటారా అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇది అమలు చేయాలంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.