ఆరోగ్యానికి ఆధార్‌

సర్కారీ ఆస్పత్రికి వెళితే ఆధార్‌, సెల్‌ నంబర్‌ ఇవ్వాల్సిందే
తొలుత 110 ఆస్పత్రుల్లో అమలు
దశల వారీగా అన్ని ఆస్పత్రుల్లో  పేషంట్లకు కాల్‌సెంటర్‌ నుంచి ఫోన్లు
ఆస్పత్రి సేవలు, సౌకర్యాలపై ఆరా

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారా?ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకెళ్లండి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యానికి ఈ రెండూ తప్పనిసరి. కేంద్రం ఆదేశాల మేరకు మే 1 నుంచి తెలంగాణ వైద్య విధానపరిషత్‌ ఆధ్వర్యంలోని 110 ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అవుట్‌పేషంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సమయంలో ఆధార్‌తో పాటు రోగుల ఫోన్‌నెంబర్‌ అడుగుతారు. జిల్లా ఆస్పత్రుల్లో 4 రోజుల కిందటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేశారు.

మేరా హాస్పిటల్‌
కేంద్రం తెచ్చిన ‘మేరా హాస్పటల్‌’ అనే కొత్త కార్యక్రమంలో భాగంగా రోగుల ఆధార్‌, ఫోన్‌నెంబర్లు తీసుకుంటారు. ప్రతీ ఆస్పత్రిలో నమోదవుతున్న ఓపీడీ వివరాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్‌ కేంద్ర కార్యాల యం ద్వారా ‘మేరా హాస్పిటల్స్‌’ వెబ్‌సైట్‌కు అప్‌డేట్‌ అవుతాయి. ఆ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రోజూ పరిశీలిస్తుంది. కొన్ని ఫోన్‌ నెంబర్లకు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ చేసి ఆస్పత్రుల్లో సేవలు, వైద్యుల అందుబాటు, వైద్యం, ఆస్పత్రి వాతావరణంపై ఆరా తీస్తారు. మందులిచ్చారా? పరీక్షలన్నీ ఆస్పత్రిలోనే చేశారా.. వంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ డేటా ఆస్పత్రి పనితీరుపై ఫీడ్‌బ్యాక్‌గా ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధికీ భారీగా నిధులివ్వాలని తాజాగా నిర్ణయించారు. తాము నిధులి చ్చే ఆస్పత్రుల్లో ఎలాంటి సేవలందుతున్నాయి? ఇంకా ఎలాంటి సేవలందాలి? మెరుగుదలకు ఇంకేం చేయాలన్న దానిపై కేంద్రం దృష్టి పెట్టింది. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులకే పరిమితమైన ‘మేరా హాస్పిటల్‌’ కార్యక్రమాన్ని దశల వారీగా పీహెచ్‌సీలకు కూడా విస్తరిస్తారు.
 
ఆస్పత్రులకు ర్యాంకింగ్స్‌
ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఆస్పత్రి సేవలు గురించి తొలుత ఆరా తీస్తారు. ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మెరుగైన సేవలు అందిస్తోన్న సర్కారీ ఆస్పత్రులకు ‘రేటింగ్స్‌’ ఇస్తారు. 1 నుంచి 5 స్టార్ల రేటింగులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సేవల్లో ఏమైనా లోపాలుంటే వెంటనే వెబ్‌సైట్‌లో ఆ వివరాలను ఉంచుతారు. ప్రతీ ఆస్పత్రికి మేరా హాస్పిటల్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. ఎక్కడికక్కడ జిల్లా ఆస్పత్రులే స్వయంగా వాటి పనితీరును పరిశీలించుకోవచ్చు. రోగులు మేరాహాస్పిటల్‌.జీవోవీ.ఇన్‌. వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి సేవలపై అభిప్రాయాన్ని అందులో చేర్చవచ్చు. సేవల్లో లోపాలుంటే వెబ్‌సైట్‌లో చెప్పవచ్చు.
 
ఆధార్‌ ఇబ్బందులు
ఓపీడీ రిజిస్ట్రేషన్‌ సమయంలో అకస్మాత్తుగా ఆధార్‌ నంబరు అడగటంతో రోగులు ఇవ్వలేకపోతున్నారు. ఫోన్‌ నంబరు విషయంలో ఇబ్బంది లేదు. కొన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఆధార్‌ నంబరు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పడంతో రోగులు వెనక్కు వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల రెండు నంబర్లు ఇచ్చే సరికి క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. ముందుగా అవగాహన కల్పించి ఉంటే బావుండేదని రోగులు అభిప్రాయపడుతున్నారు.