డిసెంబరు నుంచి ఎయిమ్స్‌లో వైద్యం

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే

యాదాద్రి, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌ ఎయిమ్స్‌లో డిసెంబరు 25న ఓపీ వైద్య సేవలను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. శనివారం ఆయన ఎయిమ్స్‌ను సందర్శించారు. భవన సముదాయంలో ఉన్న మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఎయిమ్స్‌లో ఏడాదిలోగా ఇన్‌పేషంట్‌ సేవలు, 2022 నాటికి పూర్తిస్థాయి వైద్య సేవలందిస్తామని చెప్పారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రతిపాదనలు, సివిల్‌ పనుల వివరాలను ఎయిమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ సన్మాన్‌సింగ్‌ వివరించారు. 1028కోట్ల అంచనాతో 750 పడకలతో ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం పొందినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎయిమ్స్‌ను వెయ్యి పడకలకు పెంచాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.