50 దాటిన తర్వాతే ఎక్కువగా కేన్సర్‌!

80 శాతం కేసుల్లో 2 లేదా 3 స్టేజీల్లోనే గుర్తింపు

క్యాన్సర్‌ క్లినిక్‌ల నిర్వాహకురాలు సోనాలీ శృంగార్‌

16-7-2017:ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన జబ్బుల్లో కేన్సర్‌ ఒకటి. ప్రతి ఏడాది మన దేశంలో పది లక్షల కేన్సర్‌ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 50 ఏళ్లు దాటిన వారే ఎక్కువ అంటారు- మన దేశంలో తొలి సారి క్యాన్సర్‌ నివారణ, నిర్వాహణ, చికిత్సల కోసం క్లినిక్‌లను ఏర్పాటు చేసిన సోనాలీ శృంగార్‌. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా క్లినిక్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మన దేశంలో కేన్సర్‌ చికిత్సలో వస్తున్న మార్పుల గురించి ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..

 
క్యాన్సర్‌ ఎందుకంత ప్రమాదకరమైనది?
ఇన్నేళ్ల పరిశోధనల తర్వాత కూడా కేన్సర్‌ విషయంలో మనకు ప్రశ్నలే ఎక్కువ. సమాధానాలు తక్కువ. ఉదాహరణకు పొగాకు తాగేవారికి లంగ్‌ కేన్సర్‌ వస్తే- కారణం ఏమిటో మనం గమనించగలుగుతాం. జీవితంలో పొగాకు ముట్టని వాళ్లకు కేన్సర్‌ వస్తే- ఎందుకు వచ్చిందో తెలియదు. జన్యు కారణాల వల్ల రావచ్చు. జీవన శైలి వల్ల రావచ్చు. ఇక- మన దేశంలో 80ు కేసుల్లో రెండో, మూడో స్టేజీల్లోనే క్యాన్సర్‌ వచ్చిందని తెలుస్తుంది. ఈ దశ లో కేన్సర్‌ నివారణ కష్టమవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ ఉండదు. అందువల్లే కేన్సర్‌ చాలా ప్రమాదకరం.
 
ఏ వయస్సు వారికి కేన్సర్‌ ఎక్కువ వస్తుంది?
కచ్చితంగా చెప్పలేం. ఎవరికైనా రావచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వయస్సు ఉన్నవారి దాకా ఎవరికైనా రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే- 50 ఏళ్లు దాటిన వారికే కేన్సర్‌ ఎక్కువ వస్తోంది. ఇటీవల కాలంలో 21 ఏళ్ల వయస్సు దాటిన వారందరినీ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకొమ్మని సలహా ఇస్తున్నారు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణ అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలకు కూడా కేన్సర్‌ రావటం బాగా పెరిగింది. ఏ వయసు వారికి.. ఏ ప్రాంతం వారికి.. ఎలాంటి కేన్సర్‌ వస్తోందో చెప్పలేకపోవటానికి ప్రధాన కారణం- కచ్చితమైన సమాచారం లేకపోవటం.
 
ప్రభుత్వం కేన్సర్‌ రిజిస్ట్రరీలు నిర్వహిస్తుంది కదా..
మన దేశం మొత్తానికి కేంద్రీకృత రిజిస్ట్రరీ లేదు. రాష్ట్రాలన్నీ వేర్వేరుగా రిజిస్ట్రరీలు పెట్టి సమాచారం నమోదు చేస్తున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల దగ్గర, ట్రస్ట్‌ ఆసుపత్రుల దగ్గర, మాలాంటి సంస్థల వద్ద కూడా సమాచారం ఉంటుం ది. వీటన్నింటినీ సమీకృతం చేసే వ్యవస్థ ఉంటే క్యాన్సర్‌కు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకోవటం చాలా సులభమవుతుంది. ఉదాహరణకు- ఒక ప్రాంతంలో లంగ్‌ కేన్సర్‌ ఎక్కువ ఉందనుకుందాం. ఆ ప్రాంతంలోనే లంగ్‌ కేన్సర్‌ ఎక్కువగా ఉండటానికి కారణాలు వెతకవచ్చు.
 
విదేశాలలో ఎలాంటి విధానాలు అమలులో ఉన్నాయి..
వారు స్ర్కీనింగ్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అమెరికాలో హెల్త్‌ చెకప్‌ నిర్ణీత షెడ్యూల్‌లో చేయించుకోపోతే- ఇన్సూరెన్స్‌ కంపెనీలు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చులు చెల్లించవు. బ్రిటన్‌లో నేషనల్‌ హెల్త్‌ స్కీమ్‌లో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్త్‌చెకప్‌ చేయించుకోవాలి. మన దేశంలో అలాంటి విధానాలులేవు. దీనివల్ల కేసులు పెరుగుతాయి.
 
కేన్సర్‌ మందులు అందరికీ పనిచేయవనే వాదన..
ఇది నిజమే. కేన్సర్‌కు వాడే మందులు అందరికీ ఒకే విధంగా పనిచేయవు. ఉదాహరణకు ఇద్దరు కవలలకు క్యాన్సర్‌ వచ్చిందనుకుందాం. వారికి ఒకే మందు ఇస్తే- ఒకే విధంగా పనిచేస్తుందనే నమ్మకంలేదు. జన్యుకోడ్‌ ఆధారంగా కేన్సర్‌ వస్తుందో లేదో తెలుసుకొనే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీనిపై మరింత పరిశోధనలు జరిగితే ఒక మందు పనిచేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.
 
కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ విధానాల్లో మనం ఎక్కడున్నాం..
మౌలిక సదుపాయాలు, మిషన్ల విషయంలో మనం పాశ్చాత్య దేశాలతో పోటీపడుతున్నాం. అయితే మెడికల్‌ టెక్నాలజీ, పరిశోధనల విషయంలో వారు మన కన్నా చాలా ముందున్నారు. చాలా మంది డాక్టర్లు విదేశాలలో శిక్షణ తీసుకొని మన దగ్గరకు వచ్చి స్థిరపడుతున్నారు. మన దగ్గర సైకో ఆంకాలజి్‌స్టల సంఖ్యకూడా పెరగాల్సి ఉంది.
2014 నాటికి మన దేశంలో 33 లక్షల కేన్సర్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏడాది మరో పది లక్షల చొప్పున వచ్చి చేరుతున్నాయి.
స్త్రీ, పురుషులు దాదాపు సమానంగానే కేన్సర్‌ బారిన పడుతున్నారు.
మహిళల్లో రొమ్ము, సర్వికల్‌ కేన్సర్‌, పురుషుల్లో లంగ్‌ కేన్సర్‌ ఎక్కువగా వస్తోంది.
ఇటీవల కాలంలో 5 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో కేన్సర్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.