సిలికాన్‌తో 3డీ అవయవాలు

ఐఐఐటీలో ప్రయోగాత్మకంగా రూపకల్పన

హైదరాబాద్‌, 10-08-2018: వైద్య విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి మానవ శరీరాలు కీలకం. ఆ ప్రయోగాలకు అవసరమైన అవయవాల కోసం దాతలు దొరకడం కష్టమే. పైగా, ఆస్పత్రుల్లో జరిగే సర్జరీలను విద్యార్థులు గమనించడమే తప్ప ప్రయోగాలు చేయడం చాలావరకు సాధ్యం కాని పని. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు సిలికాన్‌తో త్రీడీ మానవ అవయవాలను రూపొందించారు. విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి పలు కంపెనీలు ప్లాస్టిక్‌ మానవ అవయవాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ, ఐఐఐటీ విద్యార్థులు అనిల్‌ ఉపాధ్యాయ్‌, అరుణ్‌, రమేశ్‌.. శరీరానికి తగ్గట్లు సిలికాన్‌తో అవయవాన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం ఫైవ్‌ ఫింగర్స్‌ ఇన్నోవేషన్‌ సొల్యూషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ అవయవాలను వైద్యులు ఆమోదిస్తే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదీకాక, అంఽధులకు అవయవాలు ఎలా ఉంటాయో తెలీదు. వారి కోసం ప్రత్యేకంగా పేపర్‌పై బ్రెయిలీ లిపితో 3డీ అవయవాలను ప్రింట్‌ చేసి అందజేస్తున్నారు ఈ యువ శాస్త్రవేత్తలు.