చదువుతోనే ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి,జనవరి 26: చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికీ ఉన్న సంబంధం గురించి ఆస్ర్టేలియా పరిశోధకులు సుదీర్ఘకాలంపాటు అధ్యయనం నిర్వహించారు. సుమారు మూడులక్షల మంది మీద వీరు అధ్యయనం చేశారు. వీరందరూ 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు లోపు వారే! డిగ్రీ చదువుకున్న వారి కన్నా ఇంటర్‌తో ఆపేసిన వారే గుండెపోటుతో మరణించే అవకాశం 70 శాతం ఉందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం చదువుకున్న వారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే ఇంటర్‌తో ఆపేసిన వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉండడం, అనవసర విషయాలకి కూడా ఒత్తిడికి లోనుకావడం వంటివి పరిశోధకుల దృష్టికి వచ్చింది. దీనికి కారణం తక్కువ చదువూ, తక్కువ సంపాదనా, జీవితంలో అభద్రతా భావం కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవితానికి భద్రత, మంచి సంపాదన కావాలంటే చదువు తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు. చదువుకోని వారందరూ మృత్యువుకి దగ్గర కావడం లేదు కదా అన్న ప్రశ్నకు వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీనిమీద ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.