మనిషి ఆయువుకు హద్దులు చెప్పలేం

2-7-2017: నిండు నూరేళ్లు బ్రతకడమంటే జీవితకాలం పూర్తయినట్లు కాదని, వందేళ్లకు పైగా మనిషి జీవిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిండు అనే మాటకు అర్థం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుదుగానే అయినా వందేళ్లు పైబడి జీవిస్తున్న వాళ్లు, జీవించిన వాళ్లు చాలా మందే ఉన్నారని వివరించారు. ఈ క్రమంలో మానవుడి గరిష్ఠ జీవితకాలం ఇంత అని చెప్పే వీలులేదని, ఆ మాటకొస్తే అసలు గరిష్ఠమనే పదం ఉపయోగించలేమని మెక్‌ గిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. గతంలో మానవుడి గరిష్ఠ జీవితకాలం 115 ఏళ్లు అని తేల్చిన పరిశోధనలను వారు కొట్టిపారేస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన జియాన్నే కాల్మెంట్‌ 122 ఏళ్లు జీవించిందని వారు ఉదహరించారు. దీనికి ఓ పరిమితిని విధించలేమని స్పష్టంచేశారు. ‘మూడొందల ఏళ్ల క్రితం చాలా మంది అతి తక్కువ కాలం మాత్రమే జీవించేవారు. ఆ సమయంలో మనిషి వందేళ్లు బతుకుతాడని చెబితే పిచ్చితనంగా జమకట్టేవారు. ఇప్పుడు అది వాస్తవంలోకి వచ్చిన విషయం తెలిసిందే! కాలం గడుస్తున్న కొద్దీ మానవ జీవితకాలం పెరుగుతోంది’ అని వర్సిటీ పరిశోధకుడు సీగ్రిఫైడ్‌ హెకిమి తెలిపారు.