నవ్వుల గోళీ వేసేద్దాం!

13-7-2017:డాక్టర్‌ అంటే మెడలో స్టెతస్కోప్‌, తెల్లకోటు వేసుకుని, సీరియస్‌ ఫేస్‌తో ఇంజక్షన్‌లు చేస్తారనుకుంటే పొరపాటు పడినట్లే! ఈ డాక్టర్లు అలాంటివారు కానే కాదు. చిన్నారుల మోములపై నవ్వులు పూయించే వైద్యం చేస్తూ రోగాలు నయం చేస్తారు. ఈ డాక్టర్ల తెల్లకోటు సప్తవర్ణాలమయం. ఈ డాక్టర్ల దగ్గర స్టెతస్కోప్‌ ఉండదు, వీళ్ళ చేతుల్లో మ్యాజిక్‌ స్టిక్‌ ఉంటుంది. వీళ్ళ ఫేస్‌ ఎప్పుడూ సీరియస్‌గా ఉండదు. ఫన్నీగా ఉంటుంది. ముఖాన పెన్ను పెట్టుకుని ఆలోచించే రకం కాదు వీళ్ళు, ముఖానికి మేకప్‌ వేసుకుంటారు. ముక్కుకు ఓ చిన్న ఎర్రని బుడగలాంటిది తగిలించుకుంటారు. ఇది అచ్చం జోకర్‌ రూపమే కదూ! అవును! వీళ్ళూ డాక్టర్లలాంటివాళ్ళే. నవ్వించే డాక్టర్లు. భయం పోగొట్టే డాక్టర్లు. వీళ్ళని క్లౌన్‌ డాక్టర్లు అంటారు. వీళ్ళ క్లినిక్స్‌ని క్లౌన్‌ క్లినిక్స్‌  అంటారు.

ఇటీవల కాలంలో మామూలు డాక్టర్లకన్నా ఈ క్లౌన్‌ డాక్టర్లకే ఎక్కువ ఆదరణ పెరుగుతోంది. నిన్నమొన్నటివరకు విదేశాలలో మాత్రమే ఎక్కువగా ఉండే ఈ క్లౌన్‌ క్లినిక్‌ల సంఖ్య మనదేశంలోనూ పెరుగుతోంది. ఇంతకీ ఈ క్లౌన్‌ డాక్టర్లు ఏం చేస్తారు? ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తారు? అసలు ఆ వేషం ఏంటి? అనే సందేహాలు మీలో కలుగుతున్నాయా? అయితే వీరి గురించి తెలుసుకోండి మరి!

చిన్నినవ్వుతో రోగం మాయం !

ఒక చిన్న చిరునవ్వు ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తుందంటారు. మనిషికి భౌతికంగా వచ్చే వ్యాధికి మందు ఇవ్వగలంగానీ, మనోవ్యాధికి ఏ డాక్టరూ మందు ఇవ్వలేడు. అదే ఒక మనిషిని మానసికంగా బలవంతుణ్ణి చేస్తే ఎంతటి రోగమైనా మటుమాయమవుతుంది. అదే పనిచేస్తున్నారు ఈ క్లౌన్ డాక్టర్లు. వీళ్ళల్లో ఎక్కువ చిన్నపిల్లల డాక్టర్లే. కొందరు పెద్దవాళ్లను కూడా చూస్తారు. వారు సంతోషాల ఇంజెక్షన్లు, నవ్వుల బిళ్లలు, సరదాల మందు వేసి రోగాన్ని త్వరగా తరిమేసేందుకు ఫన్నీ గ్లౌజులు తొడుగుతారు. ఆటపాటలు, ట్రిక్కులు, ఫీట్లతో చిన్నారుల్ని కేరింతలు కొట్టిస్తూ ఆస్పత్రి అంటే అమ్మో! భయం అనే ధోరణి పోగొడతారు. హ్యూమరోపతి, నవ్వుల థెరపీలతో మనసును కుదుట పరుస్తారు. చికిత్సను తేలిక చేస్తారు. వైద్యం అందిస్తారు. 

చిన్న ఇంజక్షన్ తీసుకోవాలంటే పెద్దవాళ్లు సైతం భయపడుతుంటారు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్‌ తీసుకునే బదులు ఇంటి చిట్కాలతో రోగం తగ్గించుకోవాలని చూస్తుంటారు. అలాంటప్పుడు ఇక చిన్నపిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. వారికి డాక్టర్లంటేనే భయం. పిల్లలెవరైనా అల్లరి చేస్తుంటే డాక్టరు దగ్గరికి తీసుకెళ్తా అనగానే అల్లరి మానేస్తారు. అంత భయం వారికి. అందుకే సూదిమందంటే ఆమడదూరంలో ఉంటారు. తెల్లని దుస్తుల్లో కనిపించే డాక్టర్లంటే వారికి హడల్‌. ఆస్పత్రి పరిసరాలు, తోటి చిన్నారుల ఏడుపులు, పెడబొబ్బలు హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేస్తాయి. స్టెతస్కోప్‌ పెట్టి చూస్తే గుండెలు డబడబా కొట్టేసుకుంటాయి. మరి మందు వేసేదెలా. అందుకు మేమున్నాం కదా అంటూ ముందుకు వచ్చేశారు క్లౌన్‌ డాక్టర్లు. అదేనండీ! హాస్పిటల్‌ జోకర్లు!

బుడతలతో ఫ్రెండ్లీగా

క్లౌన్ డాక్టర్లు అనగానే అన్నిరకాల వైద్యం చేస్తారు అనుకునేరు. నిజానికి వీరు డాక్టర్లు కానే కారు. కానీ వీరి గెటప్‌ చూస్తే అలా అనిపిస్తుంది అంతే! వీరు ఇంజక్షన్లు చేయరు. మందులు రాయరు. కేవలం ఆస్పత్రుల్లో తమ ట్రిక్కులతో చిన్నారుల్ని ఆకట్టుకుని వైట్‌గౌన్‌ సిండ్రోమ్‌ అంటే వైద్యుల ఆహార్యం చూసి భయపడే ఒకరకమైన జబ్బు నుంచి బయట పడేస్తారు. ఆటలతో, పాటలతో బుడతల భయాలు ఎగరగొట్టేస్తారు. ఫ్రెండ్లీ నేచర్‌తో చిన్నారులలో ఉన్న అనుమానాలను తొలగించేస్తారు. మ్యాజిక్‌ ట్రిక్కులతో నొప్పి మాయం చేస్తారు. ఒక్క చిన్నారులకే కాదు. పెద్దలకు కూడా వీళ్ళ నవ్వుల మందు 100 శాతం పని చేస్తుంది. విదేశాల్లో ఇప్పుడు క్లౌన్‌ డాక్టర్ల చికిత్సకు విశేష స్పందన ఉంది. కేన్సర్‌ లాంటి పెద్ద పెద్ద రోగాల బారినపడిన వారికి మనోస్థైర్యం అందిస్తోంది ఈ క్లౌన్‌ క్లినిక్స్‌ చికిత్స.

వీళ్లూ వాళ్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఓ పాజిటివ్‌ ఎమోషన్స్‌ చేకూర్చి అంతా బానే ఉందనే సంతోషం కలిగిస్తుంది.

 

నవ్వుతూ నవ్విస్తూ

రోగుల జబ్బులు నయం చేయడానికి క్లౌన్‌ డాక్టర్లు ఎలాంటి రకం మందులు వాడతారని ఆలోచిస్తున్నారా! వారికి వేరే మందులు మాకులు ఏమీ అక్కర్లేదు, మ్యాజిక్‌, మిమిక్రీ, జంగ్లరీ, ఆటలు, పాటలు, సర్కస్‌ ఫీట్లు, కథలు చెప్పడం, బొమ్మలు, ఇవే క్లౌన్ డాక్టర్ల మందులు. తమ తమ ఫీట్లతో రోగుల్లో నవ్వులు తెప్పించి ఆ సందట్లో సూదిమందు గుచ్చేస్తారు, చాక్లెట్లు చప్పరించినట్లు మందుగోళీలు చప్పరించేలా చేస్తారు. ఏదో జ్యూస్‌ తాగుతున్నవారిలా ఫోజులు కొట్టి చిన్నారుల చేత మూత టానిక్కును గడగడా తాగించేస్తారు. రోగుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి ఇబ్బంది కలిగించని అంశాలనే, వ్యగ్యంగా ప్రయోగిస్తూ నవ్వులు పేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఇలా అల్లరి చేస్తుంటే మిగతా రోగులకు ఇబ్బంది కలుగుతుంది కదా అని అనుకుంటున్నారా అదే మామూలు డాక్టర్లకి క్లౌన్‌ డాక్టర్లకి తేడా. ఆస్పత్రిలో ఉండాల్సిన పరిశుభ్రత పాడవుకుండా, మిగతావారు డిస్ట్రర్బ్‌ అవకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. ఆస్పత్రి పరికరాలను దృష్టిలో పెట్టుకుని వీరు ప్రవర్తిస్తారు. వీరికి శిక్షణనిచ్చేందుకు కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. చాలామంది విదేశాల్లో దీన్ని ఓ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. కేవలం క్లౌన్‌ డాక్టర్‌ కోర్సు మీద ఇజ్రాయిల్ దేశం డిగ్రీని కూడా అందిస్తోంది.

 

ఎప్పటి నుంచో ఉంది

ఈ నవ్వుల డాక్టర్‌ అదేనండీ క్లౌన్‌డాక్టర్‌ కొత్తగా ఏమీ రాలేదు. 13వ శతాబ్దం నుంచే ఈ తరహా ఏర్పాట్లు ఉన్నాయని అంటున్నారు. కానీ వైద్యరంగంలో మాత్రం ఇది వెలుగులోకి వచ్చింది నోర్మన్‌ కజిన్స్‌ వల్లనే. ‘సాటర్‌ డే రివ్యూ’ అనే పత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్న కజిన్స్‌ 1970దశకంలో తీవ్రమైన యాంకిలైస్‌ స్పాండిలైటిస్‌ అనే సమస్యతో బాధపడ్డాడు. నొప్పి నుంచి ఉపశమనం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏవీ ఫలితం ఇవ్వలేదు. ఓసారి క్లౌన్ ప్రదర్శన తిలకించిన సందర్భంలో నొప్పి జాడ తెలియలేదు. ఈ విషయం పసిగట్టిన ఆయన ఇక నవ్వుల్ని వదల్లేదు. అలా కొంతకాలానికి పూర్తిగా కోలుకున్నాక తన అనుభవాన్ని పత్రికలో ప్రచురించారు. దాంతో విశేష ప్రచారం లభించింది. 1993లో ఫ్రెంచ్‌ సంగీతకారుడు ఆన్టోనిన్‌ మారెల్‌, స్పెయిన్‌కు చెందిన క్లౌన్‌ టోర్టెల్‌ పాల్ట్రొవాతో కలిసి క్రొయోషియాలో శరణార్థి శిబిరం సందర్శించారు. వారు ఊహించని విధంగా సుమారు 700 మంది చిన్నారులు వారి ప్రదర్శనలకు కేరింతలు కొట్టారు. భయానక పరిస్థితుల్లో అప్పటి వరకు విచారంగా గడిపిన వారంతా ఒక్కసారిగా హుషారెత్తిపోయారు. ఈ రంగానికి ఇదో బూస్ట్‌. న్యూయార్క్‌లో  'బిగ్‌ ఆపిల్‌ సర్కస్‌ క్లౌన్‌ కేర్‌ యూనిట్‌'  1986లోనే ఈ క్లౌన్‌ సేవల్ని మొదలెట్టేసింది. అయితే తొలుత చికిత్సలో దీన్ని ఉపయోగించింది మాత్రం ప్యాచ్‌ ఆడమ్స్‌ అనే అమెరికా వైద్యుడు. వైద్యరంగంలో హ్యూమరో థెరపీ ప్రభావానికి గుర్తింపు తెచ్చిన ఆయన మీద ఓ సినిమా కూడా హాలీవుడ్‌లో తెరకెక్కింది. అమెరికా, యూరోప్‌ దేశాల్లో క్లౌన్‌ డాక్టర్లను ప్రత్యేకంగా వినియోగించుకుంటున్న ఆస్పత్రులు చాలానే ఉన్నాయి. 

 

మిస్‌ హీ హీ
మిస్టర్‌ హా హా 
చండీగఢ్‌లోని ప్రఖ్యాత పిల్లల హాస్పిటల్‌ (పీజీఐఎమ్‌ఈఆర్‌) డాక్టర్లు భవనీత్‌ భారతి, ప్రభుజ్యోతి మాల్హీ. వీరిద్దరూ ‘మిస్‌ హీహీ’ – ‘మిస్టర్‌ హా హా’ గా చండీఘడ్‌ వాసులకు సుపరిచితం. పిల్లలకు వారు డాక్టర్లుగా కాదు  స్నేహితులుగా అల్లుకుపోతారు. ‍ఆసుపత్రిలో సందడిచేస్తూ పిల్లలకు హాస్పిటల్‌ అంటే ఉండే భయం పోగొడతారు. అందులోనే ఉన్న అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ కేర్‌ విభానికి కూడా సారధ్యం వహిస్తూ క్లౌన్‌ డాక్టర్‌ సేవల ప్రభావాన్ని మిగితా వారికి కూడా తెలియచేస్తున్నారు.  నిత్యం ఎందరోమంది ఈ హాస్పిటల్‌ని సందర్శిస్తుంటారు. వారందరి నుంచి చిరునవ్వుల గలగలలు పొంగిపొర్లడానికి ఈ వైద్యజంట ముందడుగే కారణం. అలాగే అదే రాష్ట్రానికి చెందిన రంగస్థల దర్శకులు సుఖ్‌మణి కోహ్లీదీ ఇదే బాట. ఆయన కూడా వివిధ వర్క్‌షాపుల ద్వారా క్లౌన్‌ డాక్టర్లపై అవగాహన కలిగిస్తున్నారు. 'ఫైండ్‌ థైర్‌ క్లౌన్‌' పేరిట క్లౌన్‌ థెరపీ అందిస్తున్నారు. చెన్నై, పుదుచ్చేరి లాంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే క్లౌన్‌ డాక్టర్ల సందళ్లు మొదలయ్యాయి ఇదీ ఓ రకమైన వృత్తి అనే స్పృహ కలిగితే ఈ రంగానికి ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్య బృందాలు ప్రోత్సాహం లభిస్తే విదేశాల్లో మాదిరిగా క్లౌన్‌ థెరపీ కూడా ఓ కెరీర్‌గా మారే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగావకాశాలతో పాటు ఆస్పత్రి సేవలు మెరుగవుతాయి.
 
మనదేశంలో ఇప్పుడిప్పుడే
బయట దేశాల్లో ప్రాముఖ్యం పొందిన ఈ క్లౌనింగ్‌ థెరపీ మనదేశంలో చాలా తక్కువ. మనదేశంలో చాలా ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇటువంటి సేవలు ఉంటాయనే విషయం కూడా తెలీదు. క్లౌన్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌, ది హ్యూమర్‌ ఫౌండేషన్‌, క్లౌన్‌ హీలర్స్‌, హోప్‌ డాక్టర్స్‌ వంటి సంస్థలు మహా నగరాల్లో ఈ వృత్తిని అలవాటు చేస్తున్నాయి. 
 
ఖుషీ ఖుషీగా నవ్వుతూ
‘మనిషికి కష్టకాలం ఉండొచ్చు. అంత మాత్రాన నవ్వుల పరుగు ఆపకండి. నవ్వులతో మీ కష్టాలన్నీ దూరమవుతాయి. నవ్వులు మీ ఆలోచనను పక్కకు తప్పిస్తాయి.’ సిస్టంని రిఫ్రెష్‌ చేయకపోతే ఎలా హ్యాంగ్ అవుతుందో మనిషి మెదడు కూడా అంతే. మెదడును నవ్వుతో రిఫ్రెష్‌ చేయాలి. లేకపోతే మనిషి బుర్ర కూడా ఆలోచనలతో హ్యాంగ్‌ అవుతుంది. ప్రతిదాన్నీ సమస్యగా చూసేవారికంటే ఎక్కువగా నవ్వుతూ ఉండేవారే ఎక్కువకాలం జీవిస్తారని అనేక పరిశోధనల్లో తేలింది. అంతేకాదు అది గాయాల తాలూకు బాధ, నొప్పి తీవ్రతల్ని తగ్గిస్తుంది. 
నవ్వు జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఆరోగ్యవంతమైన డైటింగ్‌తో ఇది జత కడితే కొవ్వును కరిగించేస్తుంది. స్థూల కాయం నుంచి బయట పడేస్తుంది.