నాలుకను చూస్తే ఏం తెలుస్తుంది?

ఆంధ్రజ్యోతి, 11-07-2017: ఏదైనా అనారోగ్యంతో డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు వాళ్లల్లో ఎక్కువమంది నాలుకను చూపించమని చెబుతారు. నోరు తెరవగానే చాలా నిశితంగా నాలుకను గమనిస్తూ ఉంటారు. ఇంతకీ నాలుకను చూడటం ద్వారా వాళ్లు ఏం తెలుసుకుంటారు. నాలుకలో కనిపించే ఏ లక్షణాల ఆధారంగా వారు ఏ నిర్ధారణకు వస్తారు? తెలుసుకోవాలని ఉంది?
- ఎన్‌. సి. మూర్తి, కరీంనగర్‌
 
శరీరంలోని చాలా అవయవాల స్థితిగతుల లక్షణాలు నాలుక మీద కనిపిస్తాయి. వీటి ఆధారంగా ఇతర పరీక్షలు చేయించడానికి ముందే ఒక అభిప్రాయానికి రావచ్చు. నాలుక మీద కనిపించే లక్షణాల్లో కొన్ని...... 
 
నాలుక వాయడం ఒక లక్షణం. దీనివల్ల మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా తింటున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారవచ్చు. ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం. నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కూడా కావచ్చు.
 
నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.. ఇవన్నీ ఐరన్‌ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.
 
సహజంగా ఎర్రగా ఉండే నాలుక మీద కొందరికి తెల్లటి మచ్చలు కనిపిస్తాయి దీనికి చాలా వరకు త్రష్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు మూలంగా ఉంటాయి.
 
కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. దీనికి ఎక్కువ శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ కారణమై ఉంటుంది. లేదా విపరీతంగా పొగతాగడం వల్ల కూడా ఈ లక్షణం కనిపించవచ్చు.
 
నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్‌ గ్రంధి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్య వల్ల గానీ కావచ్చు.
 
నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా ఉంటుంది.
- డాక్టర్‌ వి. కృష్ణారావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌