మాంసాహారంతో అకాల మృత్యువు!

09-05-2019: మాంసాహారం ఇష్టపడేవారికి ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే! ప్రతిరోజూ మాంసాహారం తినేవారు అకాల మృత్యువాత పడకతప్పదంటున్నారు పరిశోధకులు. 42 నుంచి 60 సంవత్సరాలు వయస్సుగల 2700 మంది స్త్రీ పురుషుల మీద వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేశారు. వీరిలో సగం మంది ప్రతిరోజూ 76 గ్రాముల మాంసం తీసుకునే అలవాటు ఉంది. మిగతా వారిలో సగం మంది 76 గ్రాముల కన్నా తక్కువ మాంసం తీసుకుంటారు. మిగతా వారు వారంలో ఒకటి లేదా రెండురోజులు మాత్రమే మాంసం తీసుకుంటారు. అధ్యయనకాలం ముగిసే సమయానికి వీరిలో 1200 మంది మృత్యుబారిన పడ్డారు. వీరిలో 40 శాతం మంది ప్రతిరోజూ మాంసాహారం తీసుకునేవారున్నారు. మిగతావారిలో కొందరు వారంలో ఒకటిరెండు రోజులు, మరికొందరు తక్కువ మాంసాహారం తీసుకునేవారూ ఉన్నారు. మాంసాహారం తీసుకోవడం వలనే వీరు అకాల మృత్యు వాత పడినట్లు అధ్యయనకారులు గుర్తించారు. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకటిరెండు సార్లు మాంసాహారం తీసుకోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగదని వారు స్పష్టం చేస్తున్నారు.