అర్ధరాత్రి తిండితో అధికబరువు

10-04-2019: ఇది నిజంగా నిజం అంటున్నారు పరిశోధకులు. అర్ధరాత్రి దాటిన తరువాత తినడం, పడుకోవడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో మరోసారి స్పష్టమైంది. ఆలస్యంగా పడుకోవడం వలన పెద్దగా నష్టం లేకపోయినా, అర్ధరాత్రి తిండి కచ్చితంగా అధికబరువుకు కారణమవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. 36 సంవత్సరాల వయస్సున్న 31మంది మీద అధ్యయనం నిర్వహించారు. వీరిలో ముప్పాతిక మంది స్త్రీలే ఉన్నారు. వీరి ఆహారపు అలవాట్లు, నిద్రపోయే సమయాలను పరిశీలించారు. వీరిలో తొంభైశాతం మంది ఐటి ఉద్యోగులే ఉన్నారు. వీరందరూ రాత్రి పదకొండు గంటల తరువాత భోజనం చేసేవారు. భోజనం చేసిన వెంటనే నిద్రపోయేవారు. వీరి నిద్రపోయే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వలన వీరి జీవక్రియలో మార్పులు రావడం, బిఎంఐ పెరగడాన్ని పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం ఆలస్యంగా భోజనం చేయడమే అన్నది వీరి అధ్యయనంలో స్పష్టమైంది.