కొద్దిపాటి శారీరక శ్రమతోనూ సంతోషమే

లండన్‌, జనవరి 9: కొద్దిపాటి శారీరక శ్రమకూడా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావంచూపి సంతోషాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానసిక ఆరోగ్యానికి, సంతోషంగా ఉండడానికి చెమటోడ్చేలా కష్టపడాల్సిన అవసరంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజువారీ వ్యవహారాలలో శారీరక శ్రమ ఉండేలా చూసుకున్నా సంతోషంగా ఉండొచ్చని కేంబ్రిడ్జి, ఎసెక్స్‌ వర్సిటీల పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని మూడ్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా పదివేల మంది వలంటీర్లను పరిశీలించినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా.. రోజులో వివిధ సమయాలలో వారి మూడ్‌, వారి శారీరక శ్రమకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామని చెప్పారు. ఈ వివరాలను పరిశీలించగా.. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రోజంతా యాక్టివ్‌గా, సంతోషంగా ఉన్నట్లు తేలిందని వివరించారు.