ఇంజెక్షన్‌కు బదులు ఇన్సులిన్‌ మందుబిళ్ల!

10-02-2019: మధుమేహ రోగులకు శుభవార్త! క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ను ఇప్పించుకోవాల్సిన నొప్పి నుంచి త్వరలోనే ఉపశమనం కలగనుంది. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌కు బదులుగా సరికొత్త హైటెక్‌ ట్యాబ్లెట్‌ను ఎంఐటీ, హార్వర్డ్‌, నోవో నోర్‌డిస్క్‌ పరిశోధకులు తయారు చేశారు. సాధారణంగా జీర్ణ వ్యవస్థలో ఇన్సులిన్‌, కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే యాంటీబాడీ్‌స(ప్రతిరోధకాలు) త్వరగా కరిగిపోయి.. వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అయితే, జీర్ణవ్యవస్థలో చేరాక కూడా ఇన్సులిన్‌ ప్రభావాన్ని కోల్పోని విధంగా సరికొత్త ట్యాబ్లెట్‌ను వీరు రూపొందించారు. తాబేలును పోలి ఉండే ఈ ట్యాబ్లెట్‌.. పేగుల గుండా వెళ్తూ శరీరంలో ఇన్సులిన్‌ను ప్రవేశపెట్టి.. వ్యర్థాల ద్వారా బయటకు వచ్చేస్తుందని పరిశోధకులు చెప్పారు. జంతువులపై జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.