గుండె వైఫల్యాలను తగ్గించే చాక్లెట్‌

12-09-2018: చాక్లెట్‌ తినడం అనారోగ్యమన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దీన్ని తింటే పళ్ళు పుచ్చిపోతాయనీ, ఊబకాయం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్మకం. కానీ ఇది తప్పంటున్నారు న్యూయార్క్‌ పరిశోధకులు. నెలలో మూడు బార్ల చాక్లెట్లు తినడం వలన గుండె వైఫల్యాలను 13 శాతం వరకూ తగ్గించుకోవచ్చన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది సుమారు ఐదున్నర లక్షలమంది మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. నెలలో అస్సలు చాక్లెట్లు తినని వారికన్నా, కనీసం మూడుసార్లు తిన్నవారి గుండె ఆరోగ్యం భేషుగ్గా ఉన్న విషయం వీరి దృష్టికి వచ్చింది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయని వీరు చెబుతున్నారు. చాక్లెట్‌ ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా అతిగా తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా నోటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.