సరిగమలతో సంతోషం ఎందుకంటే...

లండన్‌, డిసెంబరు 26: సరిగమలతో వినసొంపుగా సాగే భారతీయ సంగీతమైనా... డోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మనం సంతోషం కలగడానికి గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. మెదడులోని డోపమైన్‌ను రకరాల ధ్వనులు, సంగీతం నియంత్రించడం వల్లే ఈ విధంగా జరుగుతోందని డెన్మార్క్‌లోని ఆర్హస్‌ యూనివర్సిటీ, ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకులు తెలిపారు. కొంతమంది మనసుకు నచ్చిన సంగీతం వినగానే వారి కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించుకుంటారని తెలిపారు. మరికొంత మంది చిరాకుగా ఉన్న సమయంలో మంచి సంగీతం విన్నా, చిన్నపాటి ధ్వని విన్నా వారి స్థితిలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. డోపమైన్‌ సంబంధ మానసిక సమస్యలతో బాధపడేవారికి సంగీతం దివ్య ఔషధంగా పనిచేసే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా, తరచూ మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురయ్యేవారు సంగీతం వినడం ద్వారా ఉపశమనం పొందవచ్చని చెప్పారు.