చిత్తవైకల్యానికి వర్చువల్‌ దృశ్యాలతో చెక్‌!

న్యూఢిల్లీ, మే 11: చిత్తవైకల్యం లేదా జ్ఞాపకశక్తి తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న వారికి వర్చువల్‌ వాతావరణం(వాస్తవిక దృశ్యాలు-వీఆర్‌) కొత్త శక్తి ఇస్తుందని తాజా సర్వే పేర్కొంది. వీటిని చూడగానే ఒకప్పటి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారని వెల్లడించింది. అంతేకాదు మనిషిలో దూకుడు లక్షణాలను కూడా తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎస్‌ఐజీసీహెచ్‌ఐ సదస్సుకు చెందిన ప్రొసీడింగ్స్‌ అనే జర్నల్‌లో ఈ సర్వే వివరాలు వెల్లడించారు. 41 నుంచి 88 ఏళ్ల వయసున్న 8 మందిని ఎంపిక చేసి వారికి 16 సిటింగ్‌లలో వర్చువల్‌ వీడియో ద్వారా కేథ్రడాల్‌, అడవి, శాండీ బీచ్‌, రాకీ బీచ్‌, ఇతర పర్యాటక ప్రదేశాలు చూపించారు. ఈ హెడ్‌సెట్‌ను కళ్లకు పెట్టుకోగానే అందులోని దృశ్యాలు చూస్తున్న వారికి అక్కడ కనిపించే ప్రదేశంలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ పరీక్షలో పాల్గొన్న చాలా మంది తమ గతకాలపు స్మృతులను గుర్తు చేసుకున్నారని వివరించారు.