పాలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ పరార్‌!

12-09-2018: తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యమే కాదు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు అమెరికా పరిశోధకులు. బిడ్డకి ఐదు నెలల వరకూ పాలిచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు రెండున్నర శాతం తగ్గిపోతాయన్న విషయం వీరి అధ్యయనంలో తేలింది. పుట్టిన బిడ్డకు పాలివ్వడం ద్వారా స్త్రీ ప్రసవ సమయంలో పెరిగిన బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చనీ, అంతేకాకుండా హార్మోన్ల పనితీరు కూడా మెరుగుపడుతుందని వీరు చెబుతున్నారు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌లో అసమానతల కారణంగా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశముందనీ, బిడ్డకు పాలివ్వడం ద్వారా ఈ అసమానతల నుంచి  తప్పించుకోవచ్చని వారు అంటున్నారు. పుట్టిన పిల్లలకు ఐదునెలలు అంతకు మించి పాలిచ్చిన తల్లుల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు భవిష్యత్తులో గుండెజబ్బుల నుంచి 48 శాతం తప్పించుకోగలరని మరో అధ్యయనం స్పష్టం చేస్తోంది.