భారత్‌లో బ్రేక్‌ఫాస్టే అనారోగ్యపు ఆహారం!

హెల్తిఫైమీ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఉదయాన్నే తీసుకునే అల్పాహారమే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ఉపకరిస్తుందనే సూత్రం మన దేశంలో తప్పుదోవపడుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే మనం బ్రేక్‌ఫాస్ట్‌లో అత్యంత అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నామని తాజా అధ్యయనం వెల్లడించింది. తక్కువ మోతాదులో తిన్నప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌... అధిక కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, కేలరీలతో కూడి ఉంటోందని పేర్కొంది. దేశంలో స్థూలకాయులు ఎక్కువవ్వడానికి కారణమిదేనని తెలిపింది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకున్నా మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో భోజనం మాత్రం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉంటోందట. ఇందుకు కారణం భోజనంలో కూరగాయల శాతం అధికంగా ఉండడమే. అందులోనూ రాత్రి భోజనం మరింత ప్రొటీన్లతో కలిగి ఉంటోందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 2 లక్షల పట్టణాల్లో దాదాపు 10 లక్షల మంది ఆహారపు అలవాట్లపై హెల్తిఫైమీ అనే మొబైల్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌ సంస్థ అధ్యయనం చేసింది. భారతలో ఉదయం, సాయంత్రం తీసుకుంటున్న అల్పాహారాల్లో అధిక కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటున్నాయని, బీపీ, మధుమేహం, స్థూలకాయం బారినపడడానికి ఇవే ప్రధాన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది స్థూలకాయులే కాగా, వీరిలో దాదాపు 30 శాతం మంది మధుమేహం, హైబీపీతో బాధపడుతున్నట్లు హెల్తిఫైమీ తెలిపింది.