23 లో 13

30-6-2017:వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. చాలామంది తమ వయసుకు మించి కనిపిస్తుంటారు. కానీ 23 ఏళ్ల కుర్రాడు... 13 ఏళ్ల బాలుడిలా కనిపిస్తే? విచిత్రమే కదూ! క్రొయేషియాకు చెందిన 23 ఏళ్ల తొమిస్లవ్‌ జుర్‌సెస్‌, తన వయసు కంటే పదేళ్లు యంగ్‌గా కనిపిస్తుండటం విశేషం. అసలు ఎందుకు ఇలా కనిపిస్తు న్నాడంటే...?

 
యౌవనం.. పదమూడేళ్ల నుంచి మొదలవుతుంది. ఈ దశలోనే మానవుడు మానసికంగా, శారీరకంగా మార్పు చెందుతాడు. ఈ మార్పులకు హార్మోన్లే కీలకం. మన మెదడులో ఉండే ‘హైపోథాలమస్‌’, పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంటుంది. పిట్యూటరీ గ్రంథే, శరీరంలోని మిగతా గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంటుంది. ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే.. శరీర ఎదుగుదల సజావుగా సాగుతుంది. పిట్యూటరీ గ్రంథిని అందుకే ‘మాస్టర్‌ గ్లాండ్‌’ అంటాం. ఇది మెదడు కింది భాగంలో బఠాణి గింజ పరిమాణంలో ఉంటుంది.
 
తొమిస్లవ్‌ ప్రస్తుతం ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతేకాదు ‘గేమ్‌ ఆఫ్‌ థోర్న్స్‌’ టీవీ షోలో ఓ పాత్రను పోషిస్తున్నాడు. ‘గేమ్‌ ఆఫ్‌ థోర్న్స్‌’(జీవోటీ) సినిమాలో పీటర్‌ డింక్‌లేజ్‌ పోషించిన మరుగుజ్జు పాత్రను తొమిస్లవ్‌ జీవోటీ పేరుతో వచ్చే టీవీ సిరీ్‌సలో పోషించడం విశేషం. ‘యౌవనంగా కనిపించడం నా అదృష్టం. కానీ దీని వల్ల కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి’ అని అంటున్నాడు తొమిస్లవ్‌.
 
‘నా పుట్టిన రోజు వచ్చినప్పుడల్లా.. నాకు ఏదో బాధగా ఉంటుంది. ఎందుకంటే నా వయసు పెరిగిపోతుందని ఆ రోజు నాకు గుర్తొస్తుంది’ ప్రముఖ సినీ తారల మనసులో మాట ఇది. వాళ్లే కాదు చాలామంది తమ వయసు విషయంలో కాస్త గోప్యంగా ఉంటారు. వయసు పెరిగిపోతుంటే బాధ పడిపోతారు. కానీ జాగ్రెబ్‌ (క్రోయేషియా)కు చెందిన తొమిస్లవ్‌కు మాత్రం ఆ బాధ లేదు. ఎందుకంటే అతడ్ని చూస్తే.. పదేళ్ల పిల్లోడిలా ఉంటాడు. నిజానికి మాత్రం ఆ కుర్రోడి వయసు 23 సంవత్సరాలు. పిట్యూటరీ గ్రంథి లోపం కారణంగానే తొమిస్లవ్‌ ఇలా చిన్నోడిలా కనిపిస్తున్నాడు. మన శరీరంలో పెరుగుదల హార్మోన్‌తో పాటు, ఇతర హార్మోన్‌లను పిట్యూటరీ గ్రంథే ప్రేరేపిస్తుంది. ఈ గ్రంథిలో ట్యూమర్‌ పెరుగుదల కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయి. లక్షల మందిలో ఒకరికి ఇలా అవుతుంది. చైనాలో 1994లో పుట్టిన జంగ్‌ యుషన్‌ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఏడేళ్ల వయసులోనే జంగ్‌ పెరుగుదల ఆగిపోయింది.