పండుగపూట పురుడు పోయాలా?

ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం
అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం

వనస్థలిపురం/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రి అంటే పేదలకు భరోసా. కానీ నెలలు నిండిన ఓ గర్భిణి పురిటినొప్పులతో విలవిలలాడుతున్నా పట్టించుకోలేదు అక్కడి సిబ్బంది. పైగా పండుగ పూట పురుడు ఎవరు పోస్తారమ్మా.. పో.. పో.. అంటూ కసురుకున్నారు. ఆమె భర్త, కుటుంబసభ్యులు సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు. దీంతో చేసేదేమీ లేక మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం జరిగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ గర్భిణి. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద శనివారం చోటు చేసుకుంది. హయత్‌నగర్‌ తారామతి పేటకు చెందిన మేరమ్మకు శనివారం పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.

 
అయితే, ఉగాది పండుగ కావడంతో సరైన వైద్యులు లేరని కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. మేరమ్మ భర్త, కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా అక్కడి వైద్యులు వినిపించుకోకపోవడంతో.. చేసేదేమీ లేక అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎల్‌బీ నగర్‌ చౌరస్తాకు చేరుకునే సరికి ప్రసవం జరిగింది. దీంతో ఆమెను తిరిగి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి మేరమ్మ రాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌ తెలిపారు. గర్భం దాల్చిన నాటి నుంచి మేరమ్మకు తమ ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.