కడుపు ‘కోత’.. పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్లు..

ఐఐపీఎస్‌ అధ్యయనం
 
ముంబై, ఫిబ్రవరి 18: దేశంలో సిజేరియన్‌ ఆపరేషన్ల సంఖ్య పెరిగిపోయిందని.. పదేళ్ల వ్యవధిలో రెట్టింపు అయిందని ముంబైకి చెందిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) అధ్యయనంలో తేలింది. ఆ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం.. 2005-06 నాటికి మనదేశంలో జరిగిన ప్రసవాల్లో సిజేరియన్‌ కాన్పుల సంఖ్య 9 శాతం దాకా ఉంది. 2015-16 నాటికి ఇది 17 శాతానికి చేరింది. ఒకప్పుడు కాన్పు అంటే సహజ ప్రసవమే. ఏదైనా సమస్య వస్తే తల్లి ప్రాణం, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కూడా అపాయంలో పడేవి. సిజేరియన్లతో (ఆపరేషన్‌) ఆ సమస్య తీరింది.
 
కానీ.. క్రమక్రమగా సిజేరియన్లే పెద్ద సమస్యగా మారాయి. కొన్ని ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడం పెరిగిపోయింది. చాలా సందర్భాల్లో గర్భిణుల కుటుంబసభ్యులే ముహూర్తం చూసుకుని ఆ సమయానికి ఆపరేషన్‌ చేయాలని అడగడమూ పెరిగింది. సహజ ప్రసవం అంటే.. ఆ నొప్పిని తట్టుకోలేమేమోనన్న భయం వల్ల చాలామంది గర్భిణులే సిజేరియన్‌ కోరుతున్నట్టు ఐఐపీఎస్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. ఏ దేశంలోనైనా ఏటా జరిగే కాన్పుల్లో సిజేరియన్లు 15 శాతానికి మించడం మంచిది కాదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్లు పెరుగుతుండడం ఆందోళనకరం.