ఆరోగ్యానికి హామీ.. యోగా

నేను నుంచి మనం దిశగా చేసే ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా
నేడు డెహ్రాడూన్‌లో 55 వేల మందితో కలిసి యోగా

న్యూఢిల్లీ, జూన్‌ 20: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా.. డెహ్రాడూన్‌లో 55 వేల మందితో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అక్కడి ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, ప్రాచీన భారత యోగులు మానవాళికి అందించిన బహుమతి అని మోదీ ట్వీట్‌ చేశారు. ఆరోగ్య హామీకి యోగా ఒక పాస్‌పోర్టు లాంటిదన్నారు. ఏదో పొద్దున పూట కాసేపు ఆసనాలు వేయడమే యోగా కాదని.. నిత్యం మనం చేసే రోజువారీ పనులను సైతం శ్రద్ధగా, పరిపూర్ణ అవగాహనతో చేయడం కూడా యోగానే అని ఆయన పేర్కొన్నారు.

 ‘‘‘నేను’ నుంచి ‘మనం’ దిశగా చేసే ప్రయాణమే యోగా. అది సమతౌల్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచడంలో తోడ్పడుతుంది. అమితమైన బలాన్నిస్తుంది. నాలుగో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా.. యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. కాగా రాజధాని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్‌ శాఖ భారీ యోగా ఈవెంట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.