గర్భిణులకు ఇదేం పరీక్ష !

వికారాబాద్‌, 11-08-2018: అది.. వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి.. రూమ్‌ నంబర్‌ 20.. శుక్రవారం ఉదయం 10 గంటలు.. ఏడెనిమిది మండలాలకు చెందిన సుమారు 300 మంది గర్భిణులు వేచి చూస్తున్నారు.. ఈ వారమైనా స్కానింగ్‌ తీయించుకోవాలని..! రెండు, మూడు గంటలు క్యూలో నిలబడినా అవకాశం రాకపోవడంతో వారిలో సహనం నశించి.. ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఓ సందర్భంలో మూకుమ్మడిగా స్కానింగ్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. సాధారణంగా ఆస్పత్రిలో మంగళ, శుక్రవారాల్లో అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే రేడియోలజిస్టు రాకపోవడంతో ఆస్పత్రి వైద్యుడే పరీక్షలు నిర్వహించారు. దీంతో గంటల పాటు గర్భిణులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా.. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఆనంద్‌ మాత్రం అందుబాటులోకి రాలేదు. - తాండూరు